నేటి నుంచి హంపీలో ఫలపూజ మహోత్సవం
హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాత హంపీలో వెలసిన విరుపాక్షేశ్వర స్వామి ఆలయ ఫలపూజ మహోత్సవం ఈనెల 4 నుంచి 6 వరకు జరుగుతుందని విరుపాక్షేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి హనుమంతప్ప తెలిపారు. హంపీ విరుపాక్ష విద్యారణ్య సంస్థాన్ అధిపతి విద్యారణ్య భారతీ స్వామీజీ దివ్య సమక్షంలో ఈనెల 4వ తేదీ గురువారం రాత్రి 8 గంటలకు మున్ముఖ తీర్థంలో విరుపాక్షేశ్వర స్వామి తెప్పోత్సవం జరుగుతుంది. డిసెంబర్ 6న రాత్రి 9 గంటలకు చక్రతీర్థ కోదండరామ స్వామి ఆలయం వద్ద ఫలపూజ మహోత్సవం జరుగుతుంది. ఈనెల 4 నుంచి 7 వరకు విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు విరుపాక్షేశ్వర స్వామికి అంకితం చేసిన నవరత్న ఖచితమైన సువర్ణముఖ కమలంతో అలంకరిస్తారు. పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి విరుపాక్షేశ్వర స్వామి పూజా కార్యక్రమాల్లో పాల్గొని పంపా విరుపాక్షేశ్వర స్వామితో పాటు భువనేశ్వరి మాతను దర్శించుకుంటారని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ కవిత ఎస్.మన్నికేరి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హెచ్.సవిత పాల్గొంటారని తెలిపారు.


