కాళ్ల పారాణి ఆరక ముందే..
సాక్షి బళ్లారి: పెళ్లయిన మరునాడే నవవరుడు గుండెపోటుతో మరణించిన ఘటన విజయనగర జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు..శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హనుమంతపుర గ్రామానికి చెందిన రమేష్(30) అనే యువకుడికి విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా బండ్రి గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం నిశ్చితార్థం జరగగా నవంబర్ 30వ తేదీన పెళ్లి జరిగింది. అనంతరం మంగళవారం పెళ్లి కుమార్తె ఇంటికి వధువు, వరుడు తిరిగింపులకు రావడంతో పెద్ద ఎత్తున గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపును కూడా నిర్వహించారు. వధువు ఇంటికి చేరిన తర్వాత పెళ్లి కుమార్తె ఇంట్లో కాలు పెట్టగానే వరుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. అతనిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడు. ఈ ఘటనతో పెళ్లి కుమార్తె ఇంట ఆక్రందనలు మిన్నంటాయి. కాగా పెళ్లి కుమారుడు రమేష్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో తల్లి సొంత ఊరు హొసకుప్పె గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి చేసుకొన్న మరుసటి రోజే మృతి చెందడంతో అటు అతని అమ్మమ్మ ఇంట్లో కూడా విషాదం నెలకొంది. ఈ ఘటనతో పెళ్లి సందడి ఆవిరై కన్నీటి పర్యంతంగా మారింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. పెళ్లి కుమార్తె రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు.
గుండెపోటుతో వరుడు మృతి
రెండు కుటుంబాల్లో విషాదం
విజయనగర జిల్లాలో ఘోరం
జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ మధురానుభూతిని కల్గించే మహత్తర ఘట్టం. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు తమ కుమార్తె పెళ్లిని ఘనంగా జరిపించారు. పెళ్లయిన మరుసటి రోజున వరుడు అత్తవారింటికి తిరిగింపులకు రాగా బాజాభజంత్రీలతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. అయితే పెళ్లి కుమార్తె కాళ్ల పారాణి ఆరకముందే వరుడు అత్తింట్లో గుండెపోటుతో మరణించడంతో అటు పెళ్లి కుమార్తె, ఇటు పెళ్లి కుమారుడి ఇళ్లలో తీవ్ర విషాదం, బాధ, కన్నీరు మిగిలాయి.
కాళ్ల పారాణి ఆరక ముందే..


