ప్రతిపక్షంగా ప్రభుత్వం చెవులు పిండి పని చేయిస్తా
హుబ్లీ: రాష్ట్రంలో ఓటర్లు కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని, బీజేపీని విపక్షంలో కూర్చోబెట్టారని, ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం చెవులు పిండి ప్రజల బాగు కోసం పాటు పడతానని, ఇదే పరంపర కొనసాగిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర హామీ ఇచ్చారు. కార్వార దగ్గర శిరసిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం గద్దె కోసం కొట్లాడుతున్న బీజేపీకి మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆసక్తి లేదని విపక్ష స్థానం కూర్చొని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజు సీఎం కుర్చీ కోసం పోటాపోటీ తంతు గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రజలు చూసి చూసి విసిగి పోయారన్నారు. ప్రతి ఎమ్మెల్యే, సీనియర్ మంత్రులు, సీఎం గద్దైపె కన్నేశారన్నారు. దీంతో పాలన గాడి తప్పిందన్నారు. అన్నదాతల మేలు మరచి పోయారన్నారు. కేంద్రం రైతు సమ్మాన్, గత సీఎం బసవరాజ్ బొమ్మై అమలు చేసిన రైతు విద్యాసిరి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి రైతన్నలను కష్టాల పాలు చేసిందన్నారు. అతివృష్టి భారంతో కన్నీటిమయమైన రైతన్నను ఓదార్చలేదని సీఎం గద్దె వీరికి ముఖ్యమైందని మండిపడ్డారు. ఉత్తర కర్ణాటక అభివృద్ధి గురించి అందరితో చర్చిస్తాం. చలికాలం అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ, జేడీఎస్ మొదటి మూడు, నాలుగు రోజులు ఉత్తర కర్ణాటక సమస్యల గురించే చర్చిస్తామన్నారు. జలవనరులు సమర్థవంతంగా వినియోగించాలి. కేవలం కేంద్రాన్ని సాకుగా చూపి విమర్శించడం తగదన్నారు. బీజేపీ బహిష్కృత నేత బసవనగౌడ పాటిల్ యత్నాళ్ సమావేశం నిర్వహణకు సర్వస్వతంత్రులన్నారు. ఆయన గురించి ఎక్కువ ఏమీ మాట్లాడబోనన్నారు. అయితే జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నిర్ణయం హైకమాండ్‌దేనన్నారు. యత్నాళ్ పార్టీలో తిరిగి వస్తారా? అన్న ప్రశ్నకు నో కామెంట్ అని బదులిచ్చారు.


