మద్దతు ధర కోసం భారీ నిరసన
హొసపేటె: విజయనగర జిల్లా బీజేపీ రైతు మోర్ఛా ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని మెయిన్ బజార్ పాదగట్ట ఆంజనేయ దేవస్థానం వద్ద గుమిగూడిన బీజేపీ కార్యకర్తలు ప్రముఖ రహదార్ల ద్వారా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి రేణుకాచార్య మాట్లాడుతూ భారీ వర్షాలతో వరి, వేరుశెనగ, ఉల్లి, మొక్కజొన్నతో సహా అనేక పంటలన్నీ నష్టపోయినందుకు రైతులు విలపిస్తున్నారన్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని భర్తీ చేయలేక పోయిందన్నారు. హడగలి ఎమ్మెల్యే కృష్ణనాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు కన్నీళ్లు పెడుతున్నారన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానికి రైతులే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రైతులకు మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని, తుంగభద్ర ఆయకట్టు రైతులకు రెండవ పంటకు నీరు అందించాలని, నగరంలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయానికి అందజేశారు. మాజీ మంత్రి కరుణాకర్ రెడ్డి, నగరసభ అధ్యక్షులు రూపేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


