హెచ్‌ఐవీ జోరుకు కళ్లెం
పాజిటివిటీకి బ్రేకులు
● గడిచిన దశాబ్ద కాలంలో హెచ్‌ఐవీ పాజిటివిటీ రేటు (టీపీఆర్) కర్ణాటకలో గణనీయంగా తగ్గుముఖం పట్టడం సంతోషకరం. సమీకృత కౌన్సెలింగ్, పరీక్షా కేంద్రం (ఐసీటీసీ) చేపట్టిన హెచ్‌ఐవీ పరీక్షల్లో ఈ మహమ్మారి క్షీణత తేటతెల్లమైంది.
● 2023–24లో 0.33 ఉన్న హెచ్‌ఐవీ పాజిటివిటీ రేటు ఈ ఏడాది మార్చి నాటికి 0.32 శాతానికి పడిపోవడం గమనార్హం.
● అయితే దేశంలో హెచ్‌ఐవీ ఎక్కువగా ప్రబలుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి.
● పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తర్వాత హెచ్‌ఐవీ కేసులు అధికంగా వస్తున్నాయి.
● గతేడాది మొత్తం 38,68,182 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా అందులో 12,457 మందికి పాజిటివ్‌గా తేలింది.
● ప్రజల్లో అవగాహన పెరగడం, ఆయా వర్గాల్లో అధిక జాగ్రత్తలు పాటించడం వంటి చర్యల వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఏడాది టెస్టులు పాజిటివ్‌లు పాజిటివిటీ శాతం
2014–15 19,06,237 26,509 1.77
2015–16 19,45,282 21,989 1.39
2016–17 19,40,589 20,004 1.03
2017–18 22,20,292 18,862 0.85
2018–19 24,73,845 18,143 0.73
2019–20 25,82,946 15,683 0.61
2020–21 16,34,419 9,520 0.58
2021–22 22,26,394 10,632 0.48
2022–23 33,23,365 12,797 0.39
2023–24 39,81,572 13,183 0.33
2024–25 38,68,182 12,457 0.32
సాక్షి, బెంగళూరు: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పేరు వింటేనే వణుకు పుడుతుంది. కానీ క్రమంగా మంచి ఆరోగ్య చికిత్సలు, ఔషధాలు లభిస్తూ ఉండడంతో బాధితులు మామూలు మనుషుల మాదిరిగానే జీవిస్తున్నారు. కానీ రాష్ట్రంలో కొన్ని వర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇదింకా ప్రబలంగానే ఉంది. గతేడాది కర్ణాటకలో కొత్తగా 12,457 మందికి ఈ హెచ్‌ఐవీ వైరస్ సోకింది.
బెంగళూరులో.. బ్యాచిలర్స్‌కు
హెచ్‌ఐవీ భూతం రాజధాని బెంగళూరులో ప్రమాదకర స్థాయిలోనే ఉందని తేలింది. అందులోనూ అవివాహితుల్లో, పెళ్లి కాని యువతలో హెచ్‌ఐవీ వైరస్ కనిపిస్తోంది. రాష్ట్రంలోని హెచ్‌ఐవీ బాధితుల్లో ఎక్కువగా అవివాహితులు లేదా నవ వివాహితులు ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా బెంగళూరులో 20 నుంచి 25 శాతం మంది యువకుల్లో ఈ వైరస్ కనిపించినట్లు తెలిపారు. రాష్ట్రంలో బెంగళూరు, కోలారు, బెళగావి జిల్లాల్లో హెచ్‌ఐవీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. సూదుల ద్వారా డ్రగ్స్ సేవనం, లైంగిక చర్యల వల్ల యువత దీనికి గురవుతోంది. ఈ క్రమంలో పాఠశాల, కాలేజీల్లో కూడా ఎయిడ్స్ వ్యాప్తిపై ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో తగ్గిన కేసుల సంఖ్య
కానీ ముప్పు పొంచే ఉంది
బెంగళూరు, కోలారు, బెళగావి జిల్లాల్లో అధిక వ్యాప్తి


