దొడ్డబళ్లాపురం: చిక్కమగళూరు జిల్లా తరీకెరె అటవీ ప్రాంతంలో పిల్లలపై దాడి చేసి ఒక బాలిక ప్రాణం బలితీసుకున్న చిరుతను అటవీశాఖ సిబ్బంది కాల్చి చంపేశారు. ఇటీవల చిరుత నవిలేకల్లు గుడ్డ ప్రాంతంలో ఇంటి వెనుక ఆడుకుంటున్న సాన్వి (5) అనే బాలికను కన్నతండ్రి కళ్ల ముందే గొంతుపట్టుకుని లాక్కెళ్లి సమీపంలో చంపి పరారైంది. కొన్నివారాల కిందట 11 ఏళ్ల బాలున్ని గాయపరిచింది. ఈ నేపథ్యంలో హంతక చిరుతను పట్టుకోవాలని, లేదా కాల్చిచంపాలని అటవీ ఉన్నతాధికారులు ఆదేశించారు. మొదట అటవీశాఖ సిబ్బంది చిరుతను పట్టుకోవడానికి 10 బోనులు ఏర్పాటు చేసినా ఆ చిరుత చిక్కలేదు. శనివారం సాయంత్రం బైరాపుర వద్ద గాలిస్తుండగా చిరుత కనిపిస్తే తుపాకీతో కాల్చారు. తూటా గాయాలు తగిలిన అది పరారైంది. ఆదివారం ఉదయం కొంతదూరంలో చనిపోయి పడి ఉంది.
కన్నడ తేనెకు మోదీ కితాబు
యశవంతపుర: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్‌లో దక్షిణకన్నడ, తుమకూరులో ఉత్పత్తి అవుతున్న తేనెను ప్రస్తావించారు. దక్షిణకన్నడ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న తేనె అత్యుత్తమని మోదీ అభినందించారు. నగర ప్రాంతాల మార్కెట్‌లో అమ్ముతూ ఉపాధికి మార్గంగా ఉందన్నారు. ఇది దేశంలో తేనె ఉత్పాదనలో కొత్త చరిత్రను సృష్టించిందన్నారు. తుమకూరు సమీపంలోని శివగంగా కాళంజి సంఘం కూడా తేనె ఉత్పత్తి ద్వారా గ్రామీణులకు, రైతులకు ఉపాధిని చూపుతోందని తెలిపారు.
హంతక చిరుత కాల్చివేత


