
మరుగుదొడ్లకు నీటి వ్యవస్థ కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా జేగరకల్‌లో మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలని, ప్రహరీ నిర్మించాలని సమాజ సేవకురాలు విద్యా పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనం వద్ద ఖాళీ చెంబులతో చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. 2024–25వ సాలులో గ్రామంలో రూ.20 వేలతో నిర్మించిన మహిళల మరుగుదొడ్లకు నీటి వ్యవస్థ కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. వెంటనే నీరు, ప్రహరీ వ్యవస్థను కల్పించాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఆల్మట్టి డ్యాం నుంచి
8న కాలువలకు నీరు
రాయచూరు రూరల్: బాగల్‌కోటె జిల్లా ఆల్మట్టి డ్యాం నుంచి ఈనెల 8న ఆయకట్టు కాలువలకు నీరు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఆర్.బీ.తిమ్మాపూర్ ప్రకటించారు. మంగళవారం బెంగళూరు వికాససౌధలో యాదగిరి, బాగల్‌కోటె, విజయపుర, రాయచూరు జిల్లాల ఎమ్మెల్యేలు, కేబీజీఎన్‌ఎల్ అధికారులతో ఏర్పాటు చేసిన నీటిపారుదల సలహా సమితి సమావేశంలో మంత్రి పైవిధంగా ప్రకటించారు. కృష్ణా ఆయకట్టు ప్రాంత పరిధిలోని కాలువలకు 120 రోజుల పాటు నీటిని విడుదల చేస్తారన్నారు. వార బందీ పద్ధతి ద్వారా నీటి విడుదలకు అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. సమావేశంలో మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, ఎమ్మెల్సీ అజయ్ సింగ్, శాసన సభ్యులు కరెమ్మ, వజ్జల మానప్ప, జేటీ పాటిల్, ఽశరణేగౌడ బయ్యాపూర్, మోహన్‌రాజ్‌లున్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
రాయచూరు రూరల్: నగరంలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ వసంత కుమార్ శ్రీకారం చుట్టారు. బుధవారం 4వ వార్డులో ఎంఎల్‌ఏడీపీ ద్వారా రూ.లక్ష, రూ.25 లక్షల కేకేఆర్‌డీబీ నిధులతో హైటెక్ వంట గది, అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు భూమిపూజ జరిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా రజాక్ ఉస్తాద్, ఈశప్ప, మురళీ యాదవ్, రమేష్, శ్రీనివాస్, ఉస్మాన్, హసన్‌లున్నారు.
గురుకుల పాఠశాలను కొనసాగించాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వెనుక బడిన వర్గాల బాలికల గురుకుల పాఠశాలను కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏఐడీఎస్‌ఓ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షులు అయ్యాళప్ప మాట్లాడారు. సర్కార్ ప్రస్తుతం ఉన్న వెనుక బడిన వర్గాల బాలికల గురుకుల పాఠశాలకు పదోన్నతిని కల్పిస్తూ దానిని రద్దు చేయడాన్ని ఖండించారు. 2025–26లో 40 మంది బాలికలు 8వ తరగతిలో చేరారని, వారి భవిష్యత్తు కోసం మళ్లీ బీసీ బాలికల గురుకుల పాఠశాలను కొనసాగించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా విద్యా శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
నిరుద్యోగికి
రూ.9.25 లక్షల బురిడీ
హోసూరు: పెద్ద మొత్తంలో జీతంతో ఉద్యోగం ఇప్పిస్తామని పట్టభద్రున్ని నమ్మించి రూ. 9.25 లక్షల నగదును స్వాహా చేశారు ఫేస్‌బుక్ మోసగాళ్లు. వివరాల మేరకు సూళగిరి ప్రాంతానికి చెందిన యువకుడు (24) బి.కాం చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో వెలువడిన ఓ ఉద్యోగ ప్రకటనను చూసి వారిని సంప్రదించాడు. ఎక్కువ జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తామని, ఇందుకుగాను వివిధ రుసుముల కింద రూ. 9.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. వారి మాటలు నమ్మి చెప్పిన బ్యాంకు ఖాతాకు నగదును జమ చేశాడు. కాలం గడిచిపోతున్నా ఉద్యోగం ఇప్పించకపోవడంతో వారి నంబర్‌కు సంప్రదించగా స్విచ్‌ఆఫ్ రావడంతో లబోదిబోమంటూ క్రిష్ణగిరి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరుగుదొడ్లకు నీటి వ్యవస్థ కోసం ధర్నా

మరుగుదొడ్లకు నీటి వ్యవస్థ కోసం ధర్నా

మరుగుదొడ్లకు నీటి వ్యవస్థ కోసం ధర్నా