
మృత్యు శకటమైన కారు
దొడ్డబళ్లాపురం: దేవస్థానానికి వెళ్తుండగా ప్రయాణిస్తున్న కారే మృత్యుశకటమైంది. బోల్తాకొట్టిన ప్రమాదంలో ఆరుమంది బంధువులు మరణించిన దుర్ఘటన దొడ్డబళ్లాపురం– హిందూపురం రహదారి మార్గంలోని నాయకరండనహళ్లి వద్ద చోటుచేసుకుంది. దొడ్డ పట్టణ పరిధిలోని కరేనహళ్లికి చెందిన ఈశ్వరప్ప (75), పురుషోత్తమ్ (75), కాళప్ప (68), నారాయణప్ప (70), గోపినాథ్(45), కారుడ్రైవర్ నరసింహమూర్తి (50) మృతులు.
ఓవర్‌టేక్ చేయబోయి..
వివరాలు.. మంగళవారం ఉదయం దొడ్డబళ్లాపురం నుంచి మంచేనహళ్లి వద్ద ఉన్న భీమేశ్వర కొండ ఆలయానికి ఇన్నోవా కారులో బయలుదేరారు. గౌరిబిదనూరు మార్గంలోని నాయకరండనహళ్లి వద్ద కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి రోడ్డుమీద పల్టీలు కొట్టి బోల్తాపడింది. అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. మరో నలుగురు గాయపడగా, బెంగళూరుకు తరలించారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆలయానికి వెళ్తుండగా బోల్తా
ఆరుగురు దుర్మరణం
దొడ్డబళ్లాపుర వద్ద విషాదం