● పరిషత్ సభాపతి రాజీనామా
బనశంకరి: విధాన పరిషత్‌లో, అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగా లేదు. ఇటువంటి సభకు అధ్యక్షత వహించాలో, లేదో కూడా తెలియడం లేదు అని బీజేపీ ఎమ్మెల్సీ, విధాన పరిషత్ సభాపతి బసవరాజ హొరట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో జరుగుతున్న పరిణామాలు, హనీ ట్రాప్ వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రవర్తన మీద ఆక్రోశం వ్యక్తం చేస్తూ సభాపతి పదవికి రాజీనామా ప్రకటించారు. లేఖను ఉపసభాపతి ప్రాణేశ్‌కు పంపించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాజీనామా అమలులోకి వస్తుందని, వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పదవి నుంచి విముక్తి కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా హుబ్లీలో మీడియాతో బాధగా మాట్లాడారు. అసెంబ్లీలో సభ్యులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. సభాపతి మాటలను పట్టించుకోవడం లేదని వాపోయారు. చర్చల్లో విలువలు పడిపోతున్నాయన్నారు. సాధారణ సమయాల్లో కూడా ప్రజాప్రతినిధుల తీరు ఏమాత్రం బాగా లేదని వాపోయారు. నలభై ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్నానని, ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రాజీనామా ఆమోదం తరువాత ఏం చేయాలనేది ఆలోచిస్తానని అన్నారు.
ఘరానా ఎస్‌ఐ సస్పెన్షన్
శివాజీనగర: చోరీ కేసుల్లో దొంగల నుంచి రికవరీ చేసిన బంగారాన్ని సొంతానికి వాడుకున్నాడు. ఆ బంగారం ఏమైందని ఉన్నతాధికారులు అడిగినప్పుడు మరో మోసానికి పాల్పడ్డాడు. వరుస వంచనలు బయటపడి సస్పెండ్ అయ్యాడో ఎస్‌ఐ. బెంగళూరులోని కాటన్‌పేట ఠాణా ఎస్‌ఐ సంతోష్ నిర్వాకమిది. వివరాలు.. గతంలో ఓ కేసులో కొంత బంగారాన్ని రికవరీ చేసి స్వాహా చేశాడు. రికవరీ చూపించడానికి మరో నాటకం ఆడాడు. ఓ బంగారు షాపు యజమానిని కలిసి రికవరీ కోసం బంగారం చూపించాలి, ఫోటో తీయించి వెనక్కి ఇస్తాను. నీ వద్ద ఉన్న బంగారు ముద్దను ఇవ్వాలని కోరారు. యజమాని సరేనని 950 గ్రాముల బంగారాన్ని ఎస్‌ఐకి ఇచ్చారు. ఎస్‌ఐ ఎన్నిరోజులైనా బంగారాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో యజమాని ఒత్తిడి చేశాడు. చివరకు కొన్ని ఖాళీ చెక్కులను ఇచ్చాడు. వ్యాపారి వాటిని బ్యాంకులో వేయగా చెల్లలేదు. నా బంగారం ఇచ్చేయాలని వ్యాపారి గట్టిగా అడిగితే ఎస్‌ఐ బెదిరింపులకు దిగాడు. చివరకు బాధితుడు డీసీపీకి ఫిర్యాదు చేశాడు. ఏసీపీ ప్రాథమిక విచారణ జరిపి నివేదిక అందజేశారు. బాగోతం నిజమేని తేలడంతో పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ ఆదేశాలిచ్చారు. హలసూరు గేట్ ఠాణాలో ఎస్‌ఐపై కేసు నమోదైంది.
రాజణ్ణ ఫిర్యాదు చేయగానే దర్యాప్తు: హోంమంత్రి
శివాజీనగర: హనీ ట్రాప్ కేసును తీవ్రంగా తీసుకొన్నాం. మంత్రి రాజణ్ణ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేసి ఉంటే ఎలాంటి విచారణ జరిపించాలో శనివారమే ప్రకటించేవాళ్లమని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. ఆదివారం బెంగళూరు సదాశివనగర ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన, రాజణ్ణ ఫిర్యాదు చేస్తే ఏ తనిఖీకి ఇవ్వాలనేది సీఎంతో చర్చిస్తాను. ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది. తీవ్రంగా తీసుకోవాల్సిందే. బీజేపీవారు సీబీఐ, హైకోర్టు జడ్జిచే విచారణ అడుగుతున్నారు అని చెప్పారు. 48 మంది హనీ ట్రాప్‌లో పడ్డారా, ఈ సంఖ్య ఎంత అనేది ఊహించేందుకు సాధ్యపడదన్నారు. కాగా, రాజణ్ణ ఇంతవరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది కుతూహలంగా మారింది.
పిల్లల చేత టాయ్‌లెట్ పనులు
● హెచ్‌ఎం, టీచర్ సస్పెన్షన్
శివాజీనగర: పిల్లలు పారిశుధ్య కార్మికులయ్యారు. పాఠశాల పిల్లలచే మరుగుదొడ్ల గుంతను శుభ్రం చేయించిన ఇద్దరు ఉపాధ్యాయినులు సస్పెండ్ అయ్యారు. బెంగళూరు దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బేగూరు ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం సాకమ్మ, పీఈటీ సుమిత్ర ఇటీవల పిల్లల చేత మరుగుదొడ్ల గుంతలను క్లీన్ చేయించిన వీడియోలు వైరల్ అయ్యాయి. చదువుకోవాల్సిన బాలల చేత ఇలాంటి పనులు చేయిస్తారా? అని తల్లిదండ్రులు భగ్గుమన్నారు. బాలల హక్కుల ఉల్లంఘన జరిగిందని ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. నిజానికి మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి కార్మికులను ఉపయోగించాలి. కానీ ఆ నిధులు రూ. 43 వేలను స్వాహా చేసి ఆ పనిని బాలలకు అప్పగించారని తేలింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ డీడీ కే.బీ.నింగరాజప్ప పై ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
బంగ్లాదేశ్ హిందువులపై హింస
● ఆ దేశంపై ఒత్తిడి తేవాలి
● ఆర్‌ఎస్‌ఎస్ నేతల డిమాండ్
బనశంకరి: బంగ్లాదేశ్ హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్‌ఎస్‌ఎస్.. ఇది మానవహక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రపంచ సంస్థలతో కలిసి బంగ్లాదేశ్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసింది. బెంగళూరు చన్నేనహళ్లిలో రెండురోజుల సంఘం సమావేశాలు జరిగాయి. సంఘం అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బంగ్లాదేశ్ హిందువులకు ప్రపంచంలోని అన్నిదేశాలు మద్దతుగా నిలవాలన్నారు. బంగ్లాదేశ్‌లో మతఛాందసవాదులతో హిందూ, ఇతర మైనారిటీ మతస్తులపై మితిమీరిన హింస జరుగుతోందని ఆరోపించారు. 1951లో 22 శాతం ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం 7 .95 శాతానికి క్షీణించిందని తెలిపారు. భారత సరిహద్దుల్లో అస్థిర వాతావరణం కల్పించడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ హిందువుల కోసం కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల్లో మాట్లాడి మద్దతు పొందడం ముదావహమని అన్నారు.