● ఖరీఫ్‌లో రైతన్న నిరాశా నిస్పృహలు
హుబ్లీ: విత్తనం సాగు చేయాల్సిన జూన్‌లో వరుణుడు కరుణించలేదు. ఫలితంగా అత్యంత తక్కువ స్థాయిలో విత్తన సాగు జరిగింది. ఇక జూలై మధ్యలో ప్రారంభమైన వర్షాలు ఎడతెగకుండా కురిసి కంగారు పుట్టించాయి. ఇది ధార్వాడ జిల్లా ఈ ఏడాది ఖరీఫ్ స్థితి. గత ఏడాది ఖరీఫ్‌లో అతివృష్టి వల్ల రైతులు పంటలను కోల్పోయారు. ఈ సారి రెండు నెలల్లోనే కరువు, వరద రెండింటినీ అనుభవించారు. జూన్‌లో వర్షాలు లేక కరువు భూముల్లోనే రైతులు విత్తనం సాగు చేశారు. అయిన వరుణుడు కరుణ చూపలేదు. విత్తనం వేసినా విత్తనాల రక్షణకు రైతులు ట్యాంకర్లలో నీరు తెచ్చి పంటకు జీవం పోశారు. జూన్ నెలలో వానలు కురవక పోవడంతో ప్రభుత్వం కూడా కరువు ప్రాంతంగా ప్రకటించే ఉద్దేశంతో ఉంది. అంతలోనే వానలు ప్రారంభం అయ్యాయి. అయితే పూర్తి స్థాయిలో విత్తన పనులు సాగక పొలాలు బీడు పడ్డాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నా పంటల స్థితిలో ఎదుగుదల లేదు. జూలైలో అతి వర్షాలతో కొన్ని చోట్ల సాగు చేసిన పెసలు, వేరుశెనగ మొక్క దశలోనే జలమయమయ్యాయి. ప్రస్తుతం వేర్లన్ని కుళ్లిపోయి పసుపురంగులోకి వచ్చాయి.