బెడిసికొట్టిన ‘వీడీసీ’ వ్యూహం | - | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన ‘వీడీసీ’ వ్యూహం

Dec 4 2025 7:36 AM | Updated on Dec 4 2025 7:36 AM

బెడిసికొట్టిన ‘వీడీసీ’ వ్యూహం

బెడిసికొట్టిన ‘వీడీసీ’ వ్యూహం

వీడీసీపై చర్యలు తీసుకోండి

మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ సర్పంచ్‌ ఎన్నిక విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) వ్యూహం బెడిసికొట్టింది. తాము చెప్పిన అభ్యర్థిని మాత్రమే సర్పంచ్‌గా ఎన్నుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గ్రామంలో సర్పంచ్‌ స్థానానికి 12 నామినేషన్లు దాఖలైన విషయం తెల్సిందే. బుధవారం విత్‌డ్రాకు అవకాశం ఉన్నప్పటికీ అభ్యర్థులెవరూ ముందుకు రాలేదు. కొందరు అభ్యర్థులను పోటీనుంచి తప్పుకోవాలని వీడీసీ చెప్పిన క్రమంలో.. అభ్యర్థులకు అధికారులు భరోసా ఇవ్వడంతో పోటీలో ఉండేందుకే సిద్ధపడ్డారు. దీంతో జగ్గాసాగర్‌ సర్పంచ్‌ ఎన్నిక పారదర్శకంగా జరిగేందుకు మార్గం సుగమమైందన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

సర్పంచ్‌ పదవికి వేలం వేయడంపై సీరియస్‌..

జగ్గాసాగర్‌లో సర్పంచ్‌ స్థానం బీసీ జనరల్‌గా రిజర్వేషన్‌ ఖరారుకావడంతో పోటీలో ఉండేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. 12 మంది నామినేషన్లు వేయగా.. సర్పంచ్‌ పదవికి వేలం వేయాలని వీడీసీ నిర్ణయించింది. ఇటీవల 17 కుల సంఘాలతో సమావేశమై రూ.28.60 లక్షలకు వేలం వేసింది. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన అదే గ్రామానికి చెందిన గూడెటికాపు కులస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని కోరారు. విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన అధికారులు.. వీడీసీ సభ్యులతోపాటు మరికొందరిని బైండోవర్‌ చేశారు. బుధవారం నామినేషన్ల విత్‌డ్రా ఉండడంతో గ్రామంలో ప్రజాస్వామ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్డీవో శ్రీనివాస్‌, డీఎస్పీ రాములు, తహసీల్దార్‌ నీత, ఎస్సై కిరణ్‌కుమార్‌, ఎంపీడీవో సురేశ్‌ పాల్గొని ప్రజాస్వామ్యబద్ధంగా సర్పంచ్‌ ఎన్నిక జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఓటింగ్‌లో ప్రతిఒక్కరూ పాల్గొని ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని సూచించారు. సర్పంచ్‌ పదవులకు వేలం వేయడం చట్టవిరుద్ధమని, అలాంటి వాటిని ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు.

ఇరుకున పడిన వీడీసీ..

సర్పంచ్‌ పదవికి వేలం వేసిన వీడీసీ సభ్యులు ఆ సమయంలో కొందరిని పోటీ నుంచి తప్పుకోవాలని సూచించినట్లు సమాచారం. వీడీసీ చర్యతో కొందరు అభ్యర్థులు తమ నామినేషన్‌లు విత్‌డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు అభ్యర్థులు తమ ఆవేదనను సన్నిహితుల వద్ద వెల్లబోసుకున్నారు. అదే సమయంలో గుడేటికాపు కులస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వీడీసీ సభ్యులను హెచ్చరించారు. మొత్తంగా ఈ వ్యవహారంలో నామినేషన్‌ వేసిన అభ్యర్థులకు సర్పంచ్‌గా పోటీ చేసేందుకు అవకాశం లభించగా.. వీడీసీ మాత్రం ఇరుకున పడినట్‌లైంది.

జగిత్యాలటౌన్‌: కుల బహిష్కరణతోపాటు వేలం ద్వారా సర్పంచ్‌ను ఎంపిక చేసేందుకు యత్నించిన జగ్గసాగర్‌ వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. వేలంపాట వద్దని వారించినందుకు గుడేటికాపు కులస్తులను గ్రామ బహిష్కరణ చేస్తూ వీడీసీ సభ్యులు తీర్మానం చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కొమ్ముల రాజ్‌పాల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, గుడేటి కాపు సంఘం సభ్యులు ఉన్నారు.

జగ్గాసాగర్‌ సర్పంచ్‌ బరిలో 12 మంది అభ్యర్థులు

నామినేషన్ల విత్‌డ్రాకు ససేమిరా

సర్పంచ్‌ ఎన్నికకు మార్గం సుగమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement