
నమ్మితే నట్టేట ముంచుడే..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రపంచం మొత్తం కంప్యూటర్, ఏఐ టెక్నాలజీ అంటూ పరుగులు తీస్తుంటే.. పల్లెల్లో మంత్రాలు తంత్రాలు అంటూ పంచాయితీలు పెట్టుకుంటున్నారు. చేతబడితో ఏదైనా చేయగలమని కొందరు మోసగాళ్లు చెబుతున్న మాటలు నమ్మి అమాయకులు డబ్బులు ఇస్తూ నిలువు దోపిడీకి గురవుతున్నారు. అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి వెళ్లాల్సిన వారు పల్లెల్లో తాయత్తులు కట్టేవారిని నమ్మి ప్రాణాలు తీసుకుంటున్నారు.
పలుచనవుతున్న బంధాలు
సమాజంలోని బంధాలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయనేందుకు తాజాగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో జరిగిన ఘటనే ఉదాహరణ. సొంత అల్లుడిని చంపించి బిడ్డను తమ వద్దకు తీసుకెళ్లేందుకు అత్తామామలే కుట్ర పన్నడం ఆలస్యంగా వెలుగుచూసింది. అది కూడా చేతబడి చేయించి చంపేందుకు అదే గ్రామానికి చెందిన ఒకరికి సుపారీ ఇవ్వడం సంచలనం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమాయకత్వమే ఆసరా
సైబర్‌నేరగాళ్లు లోన్‌లు ఇస్తామంటూ, బంపర్ డ్రా గెలుచుకున్నారంటూ ఫోన్‌లో మాట్లాడి పల్లెప్రజలను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. ఇటీవల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాకేశ్ అనే యువకుడికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి బంపర్ డ్రా గెలుచుకున్నారని, హైదరాబాద్ ఆఫీస్‌కు వస్తే బహుమతి ఇస్తామని నమ్మబలికారు. దీనికి ముందుగా రాకేశ్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాల్సి ఉంటుందని నమ్మించారు. వారి మాటలు నమ్మి ఓటీపీ చెప్పడంతో రాకేశ్ బ్యాంక్ ఖాతాలో రూ.25వేలు మాయమయ్యాయి.
నమ్మించి.. నగలు మాయం చేసి
ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో నగలు మెరుగుపెడతామంటూ ఇద్దరు వ్యక్తులు గ్రామంలో సంచరించారు. వారిని నమ్మిన ఓ మహిళ తన నగలు ఇవ్వగా, ఆమెను మాటల్లో పెట్టిన కేటుగాళ్లు ఆ నగలను ఓ మూటలో కట్టారు. ఆమైపె మత్తుమందు చల్లి పరారయ్యారు. కొద్ది సమయం తర్వాత ఆమెకు మెలకువరావడంతో మోసపోయానని గుర్తించి కేకలు వేయగా, చుట్టుపక్కల వారు గుమిగూడి ఊరిలో గాలించినా మోసగాళ్ల ఆచూకీ లభించలేదు.
అవగాహన కల్పిస్తున్నా..
గ్రామీణులు మోసపోతున్న తీరుపై ఎప్పటికప్పుడు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరుతున్నారు. అనుమానాస్పదంగా ఎవరైతే కనిపిస్తే సమాచారం అందించాలని చెబుతున్నారు. అయినా ప్రజలు ఇతరులను నమ్మి మోసపోతూనే ఉన్నారు.
చేతబడి పేరుతో డబ్బులు గుంజుతున్న కేటుగాళ్లు
లింక్‌లు పంపుతూ ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు
మూఢనమ్మకాలు, అమాయకత్వంతో ఆర్థికంగా చితికిపోతున్న జనం
అవగాహన కల్పిస్తున్నాం
సైబర్‌మోసాలు, క్షుద్రపూజలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మంత్రాలు అనే వాటిని నమ్మవద్దని కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా ప్రజలకు వివరిస్తున్నాం. అత్యాశకు పోయి మోసపోతున్నారు. సైబర్‌క్రైం జరిగితే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. మూఢవిశ్వాసాలకు దూరంగా ఉండాలి. – శ్రీనివాస్‌గౌడ్, సీఐ, ఎల్లారెడ్డిపేట

నమ్మితే నట్టేట ముంచుడే..