
జవాన్ల వేధింపులు ఆపాలి
కరీంనగర్‌కార్పొరేషన్: జవాన్ల వేధింపులను నిరసిస్తూ పారిశుద్ధ్య కార్మికులు బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో శనివారం నగరపాలక సంస్థకార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల వద్ద జవాన్‌లు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే విధుల నుంచి తొలగిస్తున్నారన్నారు. నెలరోజుల క్రితం నలుగురు కార్మికులను డబ్బులు ఇవ్వని కారణంగా తొలగించారన్నారు. జవాన్‌లకు స్థానచలనం లేకపోవడం, అధికారుల అండతో ఇష్టానుసారంగావేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జవాన్‌ల వ్యవహారంపై విచారణ జరిపించాలని, పారిశుద్ధ్యకార్మికులపై వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శానిటేషన్‌పై అవగాహన లేని వ్యక్తిని పర్యావరణ ఇంజినీర్‌గా నియమించారని విమర్శించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి బదులు పర్యావరణ ఇంజినీర్‌గా ప్రభుత్వ అధికారిని నియమించాలని కోరారు. నిరసనలో మున్సిపల్ యూనియన్ నగర అద్యక్షుడు గడ్డం సంపత్, మైస తిరుపతి, ఎల్లయ్య, రాజేందర రాజేశ్, స్వామి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.