
ఓపెన్ చదువు.. భవితకు వెలుగు
కరీంనగర్: డ్రైవింగ్ లైసెన్సు పొందాలన్నా, ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందాలన్నా కనీసం పదోతరగతి ఉత్తీర్ణత అడుగుతున్నారు. నాడు కొన్ని కారణాలతో చదువు మధ్యలో ఆపేసినవారికి ప్రభుత్వం సార్వత్రిక విధానం(దూరవిద్య)ద్వారా చదివేందుకు అవకాశం కల్పిస్తోంది. పదోతరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో పదోతరగతి కోసం 32సెంటర్లు, ఇంటర్ కోసం 24సెంటర్లు ఏర్పాటు చేశారు. 2024–25లో నిర్వహించిన పదోతరగతి పరీక్షల్లో 1,006 మంది, ఇంటర్‌లో 1,920మంది పాసయ్యారు. దూరవిద్య ద్వారా ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ చదివే అవకాశం ఉన్నా చాలా మందికి అవగాహన లేక దూరంగా ఉంటున్నారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి సార్వత్రిక విద్యాపీఠం వారు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఇవి సాధారణ విద్యార్థులకిచ్చే సర్టిఫికెట్ల మాదిరిగానే పనిచేస్తాయి. 2025–26 విద్యాసంవత్సరానికి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పదోతరగతిలో ప్రవేశాలకు..
సార్వత్రిక విద్యను అభ్యసించేందుకు 14ఏళ్ల నుంచి 50ఏళ్లు ఉన్న వారందరికీ అవకాశం కల్పిస్తారు. పదోతరగతిలో ఎలాంటి విద్యార్హత లేకున్నా ప్రవేశం పొందవచ్చు. వయస్సు నిర్ధారణకు తహసీల్దార్ లేదా మున్సిపాలిటీ అధికారులు జారీ చేసిన ధ్రువపత్రాలు ఉండాలి. గతంలో ప్రాథమిక పాఠశాలలో చేరిన వారు మధ్యలో బడి మానేస్తే టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రెండు పాస్ ఫొటోలతో ప్రవేశాలు పొందవచ్చు. ఓసీ కేటగిరికీ చెందిన పురుషులు రూ.1,000, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, వికలాంగులు, మహిళలు రూ.600 రుసుం చెల్లించాలి. వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి.
ఇంటర్‌లో చేరాలంటే
ఇంటర్ అడ్మిషన్‌కు 15ఏళ్ల వయస్సు కలిగి పదోతరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. పదోతరగతి ఒరిజినల్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రెండు పాస్ ఫొటోలతో ప్రవేశం పొందవచ్చు. సైన్సు గ్రూపులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఓసీ కేటగిరి పురుషులకు ప్రవేశ రుసుం రూ.1,100, రిజర్వేషన్ వర్తించే వారు రూ.800 చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 ఉంటుంది. స్టడీ సెంటర్లలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మధ్యవర్తులను కానీ, దళారులను కానీ ఆశ్రయించకూడదని అధికారులు చెబుతున్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ ప్రవేశాలు పొందేందుకు మీసేవ ఆన్‌లైన్ రశీదు జత చేసి ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ పరిశీలనకు నిర్ణీత సమయంలో పంపించాల్సి ఉంటుంది. డీఈవోతో నియమించబడిన అడ్మిషన్ కమిటీ దరఖాస్తు ఫారాలను పరిశీలించి ప్రవేశాన్ని నిర్ధారణ చేయనున్నారు. ఓపెన్ విద్యకు సంబంధించి సందేహాలు ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ చల్వాజి నాగేశ్వర్‌రావు సెల్‌నంబరు 8309212661ను సంప్రదించాలని జిల్లా విద్యాధికారులు వెల్లడించారు.
దూరవిద్యలో పది, ఇంటర్ చదివేందుకు అవకాశం
ప్రవేశాలకు ఆగస్టు 12వ తేదీ వరకు గడువు
సద్వినియోగం చేసుకోండి
చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ విద్య వరం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత సార్వత్రిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి. 2025–26 విద్యా సంవత్సరానికి పది, ఇంటర్ తరగతుల నిర్వహణకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న తరువాత తప్పనిసరిగా దరఖాస్తు, అవసరమైన డాక్యుమెంట్లను సంబంధిత ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లో అందజేయాలి.
– శ్రీరామ్ మొండయ్య, డీఈవో

ఓపెన్ చదువు.. భవితకు వెలుగు