
హద్దులే విడుదల
● వెల్లడి కాని ఇంటి నంబర్లు, కాలనీలు ● పునర్విభజన తుది జాబితా జారీ ● కొనసాగుతున్న గందరగోళం
కరీంనగర్ కార్పొరేషన్: ఎట్టకేలకు నగరపాలకసంస్థ డివిజన్ల పునర్విభజన తుది జాబితా విడుదలైంది. ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారం అనంతరం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీనే తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. కానీ దాదాపు వారం తరువాత 21వ తేదీ, జీవోఎంఎస్ నంబర్ 144 ద్వారా శుక్రవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. 66 డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ముందుగా ప్రకటించిన ముసాయిదాతో పోల్చితే తుది జాబితాలో భారీగా మార్పులు చోటుచేసుకొన్నాయి. నగరానికి ఉత్తరాన ఉన్న ఆరెపల్లి నుంచి 1వ డివిజన్‌ను ప్రారంభించగా, టవర్‌సర్కిల్‌లోని మార్కెట్ ప్రాంతంలో 66వ డివిజన్‌తో పునర్విభజనను ముగించారు. దీంతో ముసాయిదాలో పేర్కొన్న డివిజన్ల నంబర్లన్నీ మారాయి. హద్దులే విడుదల చేయడం గందరగోళానికి దారితీసింది.
హద్దులే మాత్రమే..
డివిజన్ల పునర్విభజనకు సంబంధించి శుక్రవారం హద్దులు మాత్రమే విడుదల చేయడంతో పూర్తిస్థాయిలో స్పష్టత కొరవడింది. ఈ నెల 4వ తేదీన జారీ చేసిన ముసాయిదాలో ఇంటినంబర్లు, కాలనీల పేర్లతో 66 డివిజన్ల వివరాలు ఇచ్చిన అధికారులు, తుది జాబితాను కేవలం డివిజన్ల హద్దులతోనే సరిపెట్టారు. దీంతో తుది జాబితాపై అస్పష్టత కొనసాగుతోంది. ముసాయిదా తరహాలోనే ఇంటినంబర్లు, కాలనీల పేర్లతో కూడిన డివిజన్ల వివరాలను వెల్లడిస్తేనే అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుందని సిటీ ప్రజలు అంటున్నారు. డివిజన్ల కాలనీలు, ఇంటినంబర్లు శనివారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మారిన డివిజన్ నంబర్లు
60 డివిజన్లు ఉండగా, ఆరు గ్రామాలు, పట్టణం విలీనం 66కు చేరడం తెలిసిందే. 66 డివిజన్ల పునర్విభజనను ప్రభుత్వం చేపట్టింది. ముసాయిదాలో ఒకటో డివిజన్‌గా తీగలగుట్టపల్లిని పేర్కొంటూ పునర్విభజనను ప్రారంభించి, రాజీవ్‌చౌక్ దిగువ భాగాన 66వ డివిజన్‌తో ముగించారు. కొత్తపల్లి, గోపాల్‌పూర్, దుర్శేడ్ గ్రామాలు కార్పొరేషన్‌లో కలవడంతో ఉత్తర సరిహద్దు తీగలగుట్టపల్లి నుంచి ఆరెపల్లికి మారింది. దీంతో ఆరెపల్లి ఒకటో డివిజన్‌గా టవర్‌సర్కిల్ ఎగువ భాగమైన మార్కెట్ ఏరియా, వెంకటేశ్వర ఆలయం, కలెక్టర్ నివాసం కలిపి 66వ డివిజన్‌గా మారాయి. ముసాయిదాతో పోల్చితే అన్ని డివిజన్‌ల నంబర్లు మారాయి. కాగా పాత డివిజన్లలో 7,8,9 డివిజన్లకు స్వల్ప మార్పలతో అవే నంబర్లు ఉన్నాయి.
లీకై న జాబితానే
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన తుది జాబితా గతంలోనే లీకు కాగా, ఆ జాబితా దాదాపు మాజీ కార్పొరేటర్ల వద్ద ఇప్పటికే చేరింది. అధికారికంగా జాబితా వెల్లడి కానప్పటికీ టౌన్‌ప్లానింగ్ నుంచి మాజీ కార్పొరేటర్లకు జాబితా లీకై ంది. అయితే అధికారికంగా విడుదలయ్యే తుది జాబితాలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే ఉత్కంఠ ఉండింది. హద్దులు లీకై న జాబితా తరహాలోనే ఇది ఉండడం విశేషం.
గందరగోళమే
డివిజన్ల హద్దులు మాత్రమే ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. ఉత్తరం నుంచి తూర్పు, దక్షిణం, పడమర, తిరిగి ఉత్తరానికి సంబంధించిన డివిజన్ల హద్దులు ప్రకటించారు. డివిజన్ల ఉత్తరం నుంచి మొదలై చుట్టూ తిరిగి ఉత్తరంతో ముగియడంతో చాలామంది డివిజన్లను అంచనా వేయలేకపోతున్నారు. ఉత్తరం పేరుతో డివిజన్ మధ్య నుంచి మొదలు కావడంతో, సరిహద్దుల్లో ఉన్న ఇంటినంబర్లతో డివిజన్‌ను ప్రకటించడం తికమకకు గురిచేసింది. ఏ ఇంటి నంబర్ నుంచి ఏ ఇంటినంబర్ వరకు, ఏ కాలనీ అనేది ప్రకటిస్తేనే తుది జాబితాపై స్పష్టత రానుంది.