
నిర్లక్ష్యం వీడని వైద్యులు
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌లో తరుచూ సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో ఆస్పత్రికి వచ్చేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆదివారం మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఓ బాలుడు మృతిచెందిన సంఘటన తెలిసిందే. ముమ్మాటికీ ఇది వైద్యుల నిర్లక్ష్యమేనంటూ ఆస్పత్రి ఎదుట బాబు బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఆర్‌ఎంవోతో పాటు ఎస్సై, ఇతర డాక్టర్లు సదరు వైద్యుడిపై ఫిర్యాదు తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఏడాది క్రితం ఓ గర్భిణికి సిజేరియన్ చేసి కడుపులోనే కర్చీఫ్ మర్చిపోయి కుట్లు వేసిన ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఆ మహిళ ఆర్నెళ్లపాటు నరకయాతన అనుభవించింది. చెకప్ కోసం మళ్లీ వైద్యుడి వద్దకు రాగా కడుపులో కర్చీఫ్ ఉన్నట్లు గుర్తించి చికిత్స చేశారు. వైద్యుల నిర్లక్ష్యమో.. సిజేరియన్లు వికటించడమోగానీ ఇదే ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు మృతిచెందారు. జగిత్యాలకు చెందిన ఓ గర్భిణి ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనివ్వగా.. సిజేరియన్ చేసి కుట్లు వేశారు. ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. కొద్దిరోజుల పాటు వైద్యసేవలు అందినప్పటికీ బాబు చనిపోయిన తాజా ఘటనతో మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు.
వైద్యులపై ఆరోపణల వెల్లువ
మాతాశిశు సంక్షేమ కేంద్రంలో పనిచేస్తున్న కొందరు వైద్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులు కొందరు సొంతంగా ఆస్పత్రులు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని తమ ఆస్పత్రికి పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాబు చనిపోయిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు, జ్యోత్న్స దంపతులకు శనివారం మాతాశిశు కేంద్రంలో బాబు పుట్టాడు. అతను ఆరోగ్యం బాగా లేదని, ఫలానా ఆస్పత్రిలో చాలామంచిగా చూస్తారని, అక్కడకు తీసుకెళ్లాలని ఆ దంపతులకు గుర్తుతెలియని వ్యక్తి సలహా ఇచ్చాడు. వాస్తవానికి అది అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్‌దని సమాచారం. బాబు అప్పటికే బరువు లేకపోవడం, పరిస్థితి సీరియస్‌గా ఉందని తిరిగి మాతాశిశు సంరక్షణ కేంద్రానికే పంపాడు. అప్పటికే బాబు చనిపోవడంతో వైద్యుల నిర్లక్ష్యమేనంటే ఆందోళనకు దిగారు. ఆ దంపతులను బయటి ఆస్పత్రికి వెళ్లమన్నది ఎవరు..? ఏ ఆస్పత్రికి వెళ్లారు..? అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.
కమీషన్ల
కోసమేనా..?
జగిత్యాల ఎంసీహెచ్‌లో తరచూ సంఘటనలు
వైద్యం అందక తాజాగా బాబు మృతి
ప్రభుత్వ వైద్యుల తీరుపై విమర్శలు
ఆస్పత్రులు కొత్తగా ఏర్పాటు చేసిన వారు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలతో కుమ్మక్కు అవుతారు. తమ ఆస్పత్రికి రోగులను తీసుకొస్తే కమీషన్లు ఇస్తామంటూ ఎర చూపుతారు. గ్రామీణ ప్రాంతంవారు, అమాయకులు ఆర్‌ఎంపీ చెప్పిన ఆస్పత్రికే వెళ్తారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలోనూ ఎవరైనా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారా..? గుర్తుతెలియని వ్యక్తులు చెప్పారా..? తేలాల్సి ఉంది. ఫలానా ఆస్పత్రిలో మంచిగా చికిత్స చేస్తారని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ప్రసవాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గతంలో 400కు పైగా అయ్యే ప్రసవాలు ప్రస్తుతం 200కు మించి జరగడం లేదని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో వైద్యులు ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి ఆస్పత్రిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
విచారణ చేస్తున్నాం
బాబు మృతి ఘటనపై పూర్తిస్తాయిలో విచారణ చేపడుతున్నాం. దంపతులను ఇందులో పనిచేస్తున్న వైద్యుడి ఆస్పత్రికి వెళ్లాలని సూచించిన వ్యక్తిని కూడా విచారిస్తున్నాం. పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటాం. ఎంసీహెచ్‌లో మెరుగైన వైద్యం అందుతుంది. నిర్లక్ష్యం ఎక్కడా లేదు.
– సుమన్‌రావు, ఇన్‌చార్జి సూపరింటెండెంట్

నిర్లక్ష్యం వీడని వైద్యులు