
మట్టిలారీలను అడ్డుకున్న గ్రామస్తులు
● నలుగురిపై కేసు నమోదు
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ అప్పమాయ చెరువు నుంచి నల్లమట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. కొలనూర్ గ్రామానికి చెందిన జక్కుల మధు, రేగుల తిరుపతి, సాత్తూరి అనిల్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో లారీలకు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ అనుమతి ఇచ్చినా.. నిబంధనలు అతిక్రమించి 25 టైర్ల లారీల్లో నల్లమట్టి తరలిస్తున్నారని వారు ఆరోపించారు. సుమారు ఐదు గంటలపాటు లారీలను ఆపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఓదెల తహసీల్దార్ సునీత సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత మట్టితరలింపు యథావిధిగా కొనసాగింది. కాగా, కలెక్టర్ అనుమతితో మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకొన్న జక్కుల మధు, మద్దెల శ్రీనివాస్, సాత్తూరి అనిల్, రేగుల తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు.