
వెయ్యి కంపెనీలు.. 3వేల ఉద్యోగాలు
● యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యం
● రేపు సింగరేణి మెగా జాబ్‌మేళా
● వేదిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం
● పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నిరుద్యోగులకు అవకాశం
గోదావరిఖని: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం ఈనెల 18న మెగా జాబ్ మేళా నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో సుమారు వెయ్యికిపైగా కంపెనీలు పాలుపంచుకుంటాయి. తమకు అవసరమైన మూడువేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయించాయి. సింగరేణి సంస్థ, నోబల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్‌మెంట్ అసోసియేషన్ ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
యువత వద్దకే కంపెనీలు..
ఉద్యోగాల సాధన కోసం యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు కంపెనీల వద్దకు వెళ్లకుండానే.. ఆయా కంపెనీలే యువత వద్దకు వస్తోంది. ఈమేరకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంది. గోదావరిఖని సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 18న ఉదయం 8గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రామగుండం రీజియన్‌లోని మూడు ఏరియాలతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈ జాబ్‌మేళాలో పాల్గొనే అవకాశం కల్పించారు.
అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి..
మెగా జాబ్‌మేళాకు హాజరైయ్యే యువతకు సింగరేణి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు చేస్తోంది. నిరుద్యోగులు తమ బయోడేటా, అర్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, అవసరమైన ఇతర ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి. మరింత సమాచారం కోసం హెల్త్‌లైన్ నంబర్లు 94911 44252, 99483 77353 నంబర్లలో సంప్రదించాలి.
ఏర్పాట్లు చేస్తున్న సింగరేణి..
మండుతున్న ఎండల ధాటికి యువత ఇబ్బందులు పడకుండా పెద్ద కూలర్లు ఏర్పాటు చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఎండదెబ్బ తాకకుండా షామియానాలు వేస్తోంది. తాగునీరు, హెల్ప్‌డెస్క్ కౌంటర్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఇంటర్వ్యూల కోసం ప్రత్యేక స్టేజీ, అభ్యర్థుల ఎంట్రీ, ఎగ్జిట్ దారులను ఏర్పాటు చేస్తున్నారు.
డీమార్ట్‌లో 200 ఉద్యోగాలు
పారిశ్రామిక ప్రాంతంలో త్వరలోనే డీమార్ట్ మెగా షా పింగ్‌మాల్ ప్రారంభిస్తారు. అందులో పనిచేసేందుకు సుమారు 200మంది సిబ్బంది అవసరం. ఇలాంటి అనేక కంపెనీలు మెగా జాబ్‌మేళాలో పాల్గొంటాయి. అపోలో ఫార్మసీ, నాన్సీహెల్త్ కేర్, లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీస్, మెడిప్లస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, పేటీఎం, ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్, ఫ్లిప్‌కార్ట్, హెచ్‌ఎఫ్‌సీఎల్ లిమిటెడ్ తదితర సంస్థలకు చెందిన హెచ్‌ఆర్‌లు ఈ ఇంటర్వ్యూలో పాల్గొని తమకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకుంటారు.
ఉద్యోగాలు ఇవే..
ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, సెక్యూరిటీ, ఆస్పత్రులు, ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్‌వేర్, ఆఫీస్ అడ్మిస్ట్రేటివ్, నర్సింగ్
అర్హతలు
– ఏడో తరగతి నుంచి పీజీ వరకు
– డిప్లొమా
– బీఫార్మా, ఎంఫార్మా
– హోటల్ మేనేజ్‌మెంట్, డ్రైవింగ్
– బీఈ, బీటెక్, ఎంటెక్
– బీఏ, బీఎస్సీ, బీకాం
– ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్
సద్వినియోగం చేసుకోవాలి
యువత సౌకర్యం కోసం సింగరేణి మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. సుమారు వెయ్యి కంపెనీల ప్రతినిధులను ఒకేవేదిక వద్దకు చేర్చుతోంది. వారికి అవసరమైన నిపుణులను గుర్తించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువత హాజరు కావాలి. ఎక్కడో, ఎప్పుడో నిర్వహించే ఇంటర్వ్యూల కోసం రోజుల తరబడి ఎదుదుచూసే దానికన్నా మన చెంతకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
– లలిత్‌కుమార్, జీఎం, ఆర్జీ–1

వెయ్యి కంపెనీలు.. 3వేల ఉద్యోగాలు