
ఆత్మస్థైర్యమే ఆలంబనగా
ఇల్లంతకుంట(మానకొండూర్): గుండెపోటుతో భర్త అకాల మరణం.. నలుగురు కూతుళ్లు చిన్నవారు. అయినా ఆ తల్లి మొక్కవోని ధైర్యంతో కష్టాలకు ఎదురొడ్డింది. ఆత్మస్థైర్యమే ఆలంబనగా పిల్లలను పెంచి పెద్ద చేసి ఆదర్శంగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన నంది లక్ష్మి భర్త కనకయ్య 2005లో గుండెపోటుతో మరణించాడు. అప్పటికే నలుగురు అమ్మాయిలు. లక్ష్మి గుండెనిబ్బరం చేసుకొని కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. మామిడి పండ్లు, చేపలు, కూరగాయలు అమ్ముతూ.. కాలానికి తగ్గట్టుగా పని చేసి తన కుటుంబాన్ని పోషించుకుంది. నలుగురు కూతుళ్లు రేణుక, మమత, లావణ్య, అనూషను చదివించింది. నలుగురిలో ముగ్గురు డిగ్రీ, చిన్న కూతురు ఇంటర్ వరకు చదివారు. పెద్ద కూతురు రేణుక కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి తల్లికి చేదోడుగా నిలిచింది. ప్రస్తుతం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. లక్ష్మి నలుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపింది.
ఆదర్శమూర్తి.. బంగారు లక్ష్మి
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): యైటింక్లయి న్‌కాలనీకి చెందిన బంగారు లక్ష్మి–రాజయ్య దంపతులకు ఐదుగురు కూతుర్లు. వారి చిన్నతనంలోనే రాజయ్య 2000 సంవత్సరంలో మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ, కూలీ పనులు చేసుకుంటూ కూతుర్లను చదివించి పెళ్లిళ్లు చేసింది. ప్రస్తుతం చిన్న కిరాణం నడుపుతోంది. పెద్ద కుమార్తె స్వరూప డిగ్రీ చేసి ఆశ వర్కర్‌గా పని చేస్తోంది. రెండో కూతురు మంజుల 10వ తరగతి చదివి ఇంట్లోనే కుట్టు మిషన్ వర్క్ చేసుకుంటుంది. మూడో కూతురు రమాదేవి ఎంబీఏ చదవగా, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. నాల్గో కుమార్తె పద్మిని పీజీ పూర్తి చేసింది. ఐదో కూతురు సంగీత (ఎమ్మెస్సీ) పీజీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. ప్రసుత్తం రామగుండం కమిషనరేట్ పరిధి కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది.

ఆత్మస్థైర్యమే ఆలంబనగా