
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి
పెద్దపల్లిరూరల్: పట్టణ శివారు చందపల్లికి చెందిన అరికె సంపత్ (27) అనే యువకుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మరణించాడని ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. సంపత్ శనివారం పశువులు మేపేందుకు వెళ్లాడు. కాగా మధ్యాహ్న భోజనం చేసే సమయంలో తాగునీటికోసం వ్యవసాయ బావివద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించిన భర్తపై కేసు
కథలాపూర్: మండలంలోని చింతకుంట గ్రామంలో అరికొప్పుల పుష్పలతను గుడిసెలో ఉంచి నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఆమె భర్త అంజయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. పుష్పలత, అంజయ్య శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. శనివారం ఉదయం పుష్పలతను గుడిసెలో ఉంచి అంజయ్య నిప్పంటించారు. ప్రమాదంలో గుడిసెలోని వస్తువులు కాలిపోయాయి. అదృష్టవశాత్తు పుష్పలతకు గాయాలు కాలేదు. పుష్పలత ఫిర్యాదు మేరకు అంజయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
మిడ్‌మానేరు భద్రతపై ఆరా
బోయినపల్లి(చొప్పదండి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు ప్రాజెక్టును శనివారం బాంబ్‌స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. భారత్, పాక్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టు పరిసరాలను బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది తనిఖీ చేశారు. ప్రాజెక్టు భద్రతపై ఆరా తీశారు.