పల్లెల్లో పారిశుధ్య పనులకు నిధులు | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పారిశుధ్య పనులకు నిధులు

May 10 2025 12:13 AM | Updated on May 10 2025 12:13 AM

పల్లె

పల్లెల్లో పారిశుధ్య పనులకు నిధులు

● స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌ మిషన్‌ కింద రూ.9.57 కోట్లు మంజూరు

కరీంనగర్‌రూరల్‌: కేంద్రప్రభుత్వం పరిశుభ్రమైన గ్రామాల కోసం చర్యలు చేపట్టింది. ప్రతీ గ్రామపంచాయతీలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద వివిధ పనులే చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎస్‌బీఎం–2025–26 ఆర్ధిక సంవత్సరంలో కరీంనగర్‌ జిల్లాకు 368 వివిధ యూనిట్ల నిర్మాణం కోసం రూ.957.23 లక్షలు మంజూరు చేసింది. ఈ నెలాఖరు వరకు ఆయా గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు.

చురుకుగా స్థల పరిశీలన..

స్వచ్ఛభారత్‌ గ్రామీణ్‌ మిషన్‌కు సంబంధించిన పనుల వివరాలను ఆయా గ్రామపంచాయతీల్లో ప్రదర్శిస్తారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామస్తుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు అవసరమో పరిశీలించి, ఇందుకు అవసరమైన స్ధలాలను ఎంపిక చేస్తారు. పంచాయతీల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నిర్మించనున్నారు. ప్లాస్టిక్‌ నిర్వహణ యూనిట్‌ కోసం తిమ్మాపూర్‌ మండలం అల్గునూరులో 20గుంటల స్ధలాన్ని అధికారులు ఇటీవల పరిశీలించి ఎంపిక చేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలు.. శంకరపట్నం మండలం గుడాటిపల్లి, నల్లవెంకయ్యపల్లి, అంబేడ్కర్‌నగర్‌, మానకొండూరు మండలం రాఘవపూర్‌, బంజేరుపల్లి, సైదాపూర్‌ మండలం గర్రెపల్లి, కుర్మపల్లి, గొల్లగూడెం, గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్‌రోడ్డు, హుజూరాబాద్‌ మండలం అంబేడ్కర్‌నగర్‌లో కొత్తగా కంపోస్టుషెడ్లు నిర్మిస్తారు. కొత్త గ్రామపంచాయతీలన్నింటినీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించేలా అవగాహన కల్పించి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇప్పటివరకు 2,600 వ్యక్తిగత మరుగుదొడ్లు, 9 సామూహిక మరుగుదొడ్లు, 6 కంపోస్టుషెడ్లు మంజూరైనట్లు ఎస్‌బీఎం జిల్లా కో ఆర్డినేటర్‌ రమేశ్‌ తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఆయా యూనిట్లకు స్ధలాలను ఎంపిక చేయడంతోపాటు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డీఆర్‌డీవో వేణుమాధవరెడ్డి తెలిపారు. వచ్చేనెలలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి, జూలైలో పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

జిల్లాకు మంజూరైన యూనిట్లు, నిధులు

యూనిట్‌ లక్ష్యం విలువ నిధులు(రూ.లక్షల్లో)

వ్యక్తిగత మరుగుదొడ్లు 3097 రూ.12వేలు రూ.371.64

సామూహిక మరుగుదొడ్లు 9 రూ.3లక్షలు రూ.27

ప్లాస్టిక్‌ నిర్వహణ యూనిట్లు 2 రూ.64లక్షలు రూ.128

కంపోస్టుషెడ్లు 10 రూ.1.50లక్షలు రూ.15

సామూహిక ఇంకుడుగుంతలు 126 రూ.93వేలు రూ.117.18

వ్యక్తిగత ఇంకుడుగుంతలు 3,713 రూ.7వేలు రూ.241.35

వ్యక్తిగత ఇంకుడుగుంతలు(ఈజీఎస్‌) 32 రూ.93వేలు రూ.29.76

ప్రభుత్వ స్థలాల్లో ఇంకుడుగుంతలు 210 రూ.13వేలు రూ.27.30

పల్లెల్లో పారిశుధ్య పనులకు నిధులు1
1/1

పల్లెల్లో పారిశుధ్య పనులకు నిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement