
రోడ్డుకిందకు దూసుకెళ్లిన లారీ
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని వంకాయగూడెంలో మంగళవారం వేకువజామున బొగ్గులారీ రోడ్డు కిందకు దూసుకుపోయింది. బొగ్గులోడ్ లారీ వైజాగ్ నుంచి నాగపూర్ వెళ్తుండగా వంకాయగూడెంలోకి చేరుకోగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో లారీ రోడ్డు కిందకు దూసుకుపోయిందని స్థానికులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో మీసేవ కేంద్రం దగ్ధం
సిరిసిల్లటౌన్: షార్ట్ సర్క్యూట్‌తో యువకుడి ఉపాధి కేంద్రం కాలిపోయిన ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణంలోని యూనియన్ బ్యాంకు సమీపంలో రజనీకాంత్ చాలా రోజులుగా మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాప్‌ను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచే సరికి కంప్యూటర్, ఫర్నీచర్, ప్రింటర్ తదితర వస్తువులు కాలిపోయినట్లు పేర్కొన్నాడు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.
రైలు ఢీకొని వృద్ధురాలు మృతి
ఓదెల(పెద్దపల్లి): కాజిపేట్– బల్లార్షా సెక్షన్ల మధ్యలోని కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలో లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద ఇదే గ్రామానికి చెందిన కాంతాల లక్ష్మి(67) పట్టాలు దాటుతుండగా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని మృతిచెందింది. రామగుండం జీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ పర్శరాములు కథనం ప్రకారం.. లక్ష్మి మంగళవారం తన పుట్టినిల్లు సుల్తానాబాద్ మండలం తొగర్రాయికి బయలుదేరింది. రైల్వేగేట్ పడి ఉండటంతో అవతలివైపునకు దాటుతుండగా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ పేర్కొన్నారు.
దొంగతనం కేసులో జైలు, జరిమానా
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలో గతేడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన దొంగతనం (రెండు) కేసుల్లో నిందితుడు ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం కోటేశ్వర్‌రావుకు 10నెలల జైలు, రూ.4వేల జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి మంజుల తీర్పునిచ్చారు. ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపిన వివరాలు.. దొంగతనాలకు సంబంధించి పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల్లో కోటేశ్వర్‌రావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, నేరం రుజువు కావడంతో జూనియర్ సివిల్ జడ్జి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్సై వివరించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 10 గ్రాముల బంగారం మాయం
వేములవాడ: వేములవాడలోని మార్కండేయనగర్‌లో తాళం వేసిన ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. తాటికొండ సంతోష్ అనే ఫిజియోథెరపిస్ట్ కు టుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం విహా రయాత్రకు వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు. ఇంట్లో ఉన్న దాచిన రూ.25వేలకు పైగా నగదు, 10 గ్రాముల బంగారం వస్తువులు చో రీ అయింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డుకిందకు దూసుకెళ్లిన లారీ