‘నల్లరంగు నోటు’ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

‘నల్లరంగు నోటు’ ముఠా అరెస్ట్‌

May 7 2025 12:06 AM | Updated on May 7 2025 12:06 AM

‘నల్లరంగు నోటు’ ముఠా అరెస్ట్‌

‘నల్లరంగు నోటు’ ముఠా అరెస్ట్‌

వెల్గటూర్‌(ధర్మపురి): నల్లరంగు నోటు పేరిట అమాయకుల నుంచి డబ్బు కాజేసే ముఠాను పట్టుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. మంగళవారం వెల్గటూర్‌ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. చెగ్యాం గ్రామానికి చెందిన రామిల్ల విజయ్‌సాగర్‌ను నల్లరంగులో ఉన్న రూ.500 నోట్లను ఒరిజినల్‌గా మార్చే రసాయనం ఉందని కంది నరేశ్‌, పాలాజి శ్రీనివాస్‌, ఎంబడి మల్లేశ్‌, అల్తాపు రాజు, మగ్గిడి కిషన్‌ నమ్మించారు. 17 ఫిబ్రవరి 2025 రోజున మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లి గ్రామానికి తీసుకెళ్లారు. ఒక ప్లాస్టిక్‌ గ్లాస్‌లో ఏదో రసాయనం పోసి నిందితుల వద్ద ఉన్న నలుపురంగు రూ.500 నోట్లను రసాయనంలో ముంచి ఒరిజినల్‌ నోట్లలా మారిపోయినట్లు నమ్మించారు. ఈ క్రమంలో రూ.లక్షకు రూ.ఐదు లక్షల నల్లరంగు రూ.500 నోట్లు ఇస్తామని, రసాయనంలో ముంచి సులభంగా లక్షలు సంపాదించవచ్చని విజయ్‌సాగర్‌ను మభ్యపెట్టారు. మార్చి 4న రూ.7 లక్షలు ఒరిజినల్‌ నోట్లు తీసుకున్నారు. కోటిలింగాలకు వస్తే రూ.35 లక్షల నల్లరంగు నోట్లు ఇస్తామని బొమ్మ కరెన్సీ నోట్ల కట్టలు చూపించారు. అదే సమయంలో రాజశేఖర్‌, కార్తీక్‌ అనే ఇద్దరు నిందితులు పోలీసులమని బెదిరించారు. నిందితులందరూ కలిసి రూ.7 లక్షల ఒరిజినల్‌ నోట్లతో పారిపోయారు. తర్వాత వారికి విజయ్‌సాగర్‌ ఫోన్‌ చేయగా, మరోసారి డబ్బు అడిగితే చంపేస్తామని బెదిరించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా మంగళవారం నిందితులు వెల్గటూర్‌ మీదుగా కరీంనగర్‌ వెళ్తుండగా, స్తంభంపల్లి వద్ద తనిఖీల్లో శ్రీనివాస్‌, రాజు, మల్లేశ్‌, రాజశేఖర్‌, నరేశ్‌ పట్టుబడ్డారు. మరో ముగ్గురు నిందితులు కిషన్‌, నవీన్‌, కార్తీక్‌ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, ఐదు సెల్‌ఫోన్లు, రూ.4వేల నగదు, ఆరు నలుపురంగు రూ.500 నోట్లు, 570 బొమ్మ కరెన్సీ నోట్లు, బైక్‌ను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. గతంలోనూ నిందితులపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాంనర్సింహారెడ్డి, వెల్గటూర్‌, ధర్మపురి, బుగ్గారం ఎస్సైలు ఉమాసాగర్‌, ఉదయ్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement