
పిడుగుపాటుకు పశువు మృతి
చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని సుందరగిరి గ్రామంలో సోమవారం రాత్రి రైతు జీల రాజు తెలిపిన వివరాలు.. రాజు తన వ్యవసాయబావి వద్ద పశువుల పాకలో సోమవారం రాత్రి పాడి పశువును కట్టేశాడు. పిడుగుపాటుకు రూ.50వేల విలువగల పశువు మృతి చెందింది. మండల పశువైద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నష్టంపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానని పేర్కొన్నారు.
ఐదుగురిపై వరకట్నం కేసు
జమ్మికుంట(హుజూరాబాద్): అదనపు కట్నం తేవాలని వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రవి తెలిపారు. మండలంలోని పాపక్కపల్లి గ్రామానికి చెందిన రవళికి ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఉమ్మనవేణి మహేశ్‌కు 2024లో కట్నకానుకలతో వివాహం జరిగింది. కొంతకాలంగా అదనపు కట్నంగా రూ.పది లక్షలు తీసుకరావాలని రవళిని భర్త, అత్తామామ ప్రమిల, మల్లయ్య, ఆడపడుచు, ఆమె భర్త మౌనిక, మల్లేశ్ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో..
జమ్మికుంట(హుజూరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రవి తెలిపారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన చిట్యాల కిషోర్ ఏప్రిల్ 29న జమ్మికుంట పట్టణంలో పేయింటింగ్ పని మగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, గాంధీచౌక్ సమీపంలో శంకరపట్నం మండలం చింతలపల్లికి చెందిన శనిగరపు చంటి అజాగ్రత్తగా బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో కిషోర్‌కు తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నాడు. బాధితుడి భార్య కోమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
ప్లాట్ కొనిస్తానని మోసం చేసిన వ్యక్తిపై..
జమ్మికుంట(హుజూరాబాద్): రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ప్లాట్ కొనిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రవి తెలిపారు. 2023లో పట్టణంలోని పొనగంటి కావ్య నుంచి మ్యనకొండ సాయికిరణ్ తక్కువ ధరకు ప్లాట్ కొనిస్తానని రూ.93లక్షలు తీసుకున్నాడు. ప్లాట్ చూపించకుండా మోసం చేస్తున్నాడు. డబ్బు అడిగితే అంతుచూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
వరి పొలం దగ్ధం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని హుస్సేన్‌మియా వాగు సమీపంలో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు జంగ రాజయ్యకు చెందిన ఎకరంపావు బాస్మతి వరి, కొరకండ్ల శ్రీనివాస్‌రెడ్డికి చెందిన 30 గుంటలు బాస్మతి వరి కుప్ప మంటల్లో కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. వరి కొయ్యలు కాలపెట్టడంవల్లే నిప్పురవ్వలు గాలికి చెలరేగి మంటలు వ్యాపించినట్లు బాధిత రైతులు వాపోయారు. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.