No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, May 10 2024 3:50 PM

No Headline

హోటళ్లలో యథేచ్ఛగా సబ్సిడీ సిలిండర్ల వినియోగం

ఎన్నికల వేళ మరింత పెరిగిన దందా

అధికారుల తనిఖీల్లేవ్‌.. ఆమ్యామ్యాలే

ప్రతీ నెల బ్లాక్‌ మార్కెట్‌కు వేల సిలిండర్లు

నగరంలో పలు ఏజెన్సీల మాయాజాలం

కరీంనగర్‌ అర్బన్‌: నగరంలోని అత్యధిక హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, చిరుతిళ్లు తయారు చేసే కేంద్రాల్లో దర్జాగా రాయితీ గ్యాస్‌ వినియోగిస్తున్నారు. పలు ఏజెన్సీలు నిబంధనలను విస్మరించి భారీ అక్రమాలకు తెర తీయగా.. పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో దందాను మరింత పెంచారు. హోటళ్లు, చిరుతిళ్ల తయారీ, రెస్టారెంట్లు, దాబాల్లో రాయితీ వంటగ్యాస్‌ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. అదేంటీ.. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ కదా అంటే.. పలు గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాకం వల్ల ఇదిగో ఇలా హోటళ్లలో చేరుతాయంతే.!!

అటకెక్కిన తనిఖీలు

ప్రభుత్వం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తుండటంతో క్షేత్రస్థాయి పర్యవేక్షించాల్సిన పౌరసరఫరాలశాఖ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నగరంలో ఇండెన్‌, హెచ్‌పీ, భారత్‌ కంపెనీల వినియోగదారులుండగా 11 గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీలు, గోడౌన్లలో తనిఖీలు చేపట్టాల్సిన పౌరసరఫరాలశాఖ అధికారులు ఏనాడో సదరు విధులను మరిచారన్న విమర్శలున్నాయి. సివిల్‌ సప్లయ్‌ ఇన్‌స్పెక్టర్‌, డీటీ సివిల్‌ సప్లయ్‌, ఏఎస్వోలు ప్రతినెలా తనిఖీలు నిర్వహించాలన్న టార్గెట్‌నే మరిచారు.

నెలకు రూ.కోట్లలో అక్రమ దందా

నగరంలోని పలు హోటళ్లలో ఆహారనాణ్యత అటుంచితే హెచ్చు ప్రాంతాల్లో కమర్షియల్‌ సిలిండర్లు పేరుకు మాత్రమే కనిపిస్తాయి. కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.2,300 ఉండగా సబ్సిడీ గ్యాస్‌ రూ.1,000కే దొరుకుతుండటం, అందుకు గ్యాస్‌ ఏజెన్సీలు, డెలివరీబాయ్‌ల సంపూర్ణ సహకారముండటంతో కమర్షియల్‌ సిలిండర్‌ వాడకాన్ని 70శాతం తగ్గించారు. ఒక్కో హోటల్‌లో కస్టమర్లను బట్టి కనిష్టంగా నెలకు 10 నుంచి 50సిలిండర్లు వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రాయితీ గ్యాస్‌ వినియోగించే ఒక్కో హోటల్‌లోనే రూ.20వేల నుంచి రూ.70వేల వరకు అక్రమంగా లాభపడుతున్నారు. రాయితీ గ్యాస్‌ వినియోగించే అన్ని ప్రాంతాలను లెక్కిస్తే నెలకు రూ.కోట్లలో ప్రయోజనం పొందుతున్నారు. మరీ ఇందులో ఎవరి వాటాలు ఎంతో తేలాల్సి ఉంది.

భారీగా తేడాలు

నగరంలో రెస్టారెంట్లు, హోటళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, టీస్టాల్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, తోపుడు బండ్లు అన్ని కలిపి 2వేల వరకు ఉంటాయని అంచనా. కానీ వారు బుక్‌చేసే సిలిండర్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. విపరీతంగా కస్టమర్లు ఉన్న హోటళ్లలోనూ తక్కువ కమర్షియల్‌ సిలిండర్లు వాడారంటే అక్రమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల వద్ద రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసే పలు విద్యాసంస్థల్లో సైతం రాయితీ సిలిండర్లు వినియోగిస్తున్నారు. పెద్దపెద్ద హోటళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలను పరిగణనలోకి తీసుకుంటే నెలకు సుమారు 10వేల సిలిండర్ల వినియోగం జరగాలి. కాగా.. 11 ఏజెన్సీల పరిధిలో కేవలం వందల్లోనే కమర్షియల్‌ సిలిండర్లను వినియోగిస్తున్నారు. మొత్తంగా సగటున నెలకు 20వేల సిలిండర్లు పక్కదారి పడుతున్నాయని సమాచారం.

తనిఖీలు చేపడతాం

డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను కేవలం గృహాల్లో మాత్రమే వినియోగించాలి. కమర్షియల్‌ సిలిండర్లను మాత్రమే వ్యాపారులు వినియోగించాలి. రాయితీ గ్యాస్‌ పక్కదారి పడుతుందన్నది తెలియదు. తనిఖీలు చేసి చర్యలు చేపడతాం.

– జిల్లా పౌరసరఫరాల అధికారి

Advertisement
 
Advertisement