మెరుగైన సేవలందిస్తా..
● 30 ఏళ్లు పైబడిన వారికి ఎన్‌సీడీ స్క్రీనింగ్ పరీక్షలు
● బీపీ, షుగర్ రాకుండా ప్రజలు జీవనశైలి మార్చుకోవాలి
● గర్భిణులు సాధారణ కాన్పుకే మొగ్గు చూపాలి
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో
లేకుంటే చర్యలు
● ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి
● ఎన్‌సీడీ కార్యక్రమం ఎలా సాగుతోంది..?
● దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం నిరంతరాయంగా ఎన్‌సీడీ కార్యక్రమం కొనసాగుతుంది. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్‌ల పరిధిలో 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ వ్యాధుల ప రీక్షలు నిర్వహిస్తున్నాం. క్యాన్సర్ స్కీనింగ్ టెస్టు లు కూడా చేస్తున్నాం. జిల్లాలో ఈ ఏడాది 5,53,425మందికి పరీక్షలు చేయగా 1,04,223 మందికి బీపీ, 63,979 మంది షుగర్ ఉన్నట్లు తేలింది. వారందరికీ రెగ్యులర్‌గా మందులు అందజేస్తున్నాం. జిల్లాలో 2,587 మంది హెచ్ ఐవీ వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలందిస్తున్నాం.
కామారెడ్డి టౌన్: ‘ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తా.. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఎన్‌సీడీ స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడకుండా ప్రజలు జీవనశైలిని మార్చుకోవాలి. గర్భిణులు సాధారణ కాన్పు వైపే మొగ్గు చూపాలి. తప్పనిసరైతేనే సిజేరియన్ చేయించుకోవాలి. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్, ఎక్స్‌రే, ల్యాబ్ కేంద్రాలు నిబంధనలు పాటించాల్సిందేనని అంటున్నారు ఇన్‌చార్జీ డీఎంహెచ్‌వో ఎం.విద్య.’ ఆదివారం ఆమె ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూ మాట్లాడారు.
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందికి సమయానికి రావడం లేదనే ఆరోపణలు ?
● డీఎంహెచ్‌వో: అలాంటిదేం లేదు. పీహెచ్‌సీలలో ఆన్‌లైన్ అటెండెన్స్ విధానం కొనసాగుతోంది. వైద్యులు, సిబ్బంది సమయానికి హాజరవుతున్నారు. ఆబాస్ నిర్వహణలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. వైద్యులు అందుబాటులో లేకుంటే చర్యలు తీసుకుంటాం.
● కు.ని ఆపరేషన్ శిబిరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు?
● రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరాలను నిలిపివేశారు. ‘కాపర్–టి’ ద్వారా 10 ఏళ్లపాటు కుటుంబనియంత్రణ కోసం మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. పురుషులకు వేసెక్టమీ కోసం శిబిరాలు నిర్వహిస్తాం.
● ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించడం లేదనే ఫిర్యాదులపై మీ స్పందన?
● మా పోగ్రాం ఆఫీసర్ల ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల ను రెగ్యులర్‌గా తనిఖీ చేస్తాం. నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
● ఆరోగ్యంపై జిల్లా ప్రజలకు మీరిచ్చే సందేశం?
● జిల్లాలో దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తుల సంఖ్య ఘననీయంగా పెరుగుతున్నాయి. బీపీ, షుగర్‌లు రాకుండా 30 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా జీవనశైలి మార్చుకోవాలి. యోగా, నడక, వ్యాయమాలు క్రమం తప్పకుండా చేయాలి. ఆరోగ్యానికి హాని కలిగించే జంక్ ఫుడ్ ఆహారాన్ని తీసుకోవద్దు.
పీహెచ్‌సీలలో ప్రసవాలు తగ్గడంపై మీ అభిప్రాయం?
పీహెచ్‌సీలలో సాధారణ కాన్పుల కోసం స్థానిక వైద్యులు ప్రయత్నిస్తున్నారు. సిజేరియన్ అయ్యే అవకాశాలుంటే ఏరియా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. గర్భిణులు సాధారణ కాన్పు అయితే ఆరోగ్యంగా ఉంటారు. సిజేరియన్‌తో భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
టీబీ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు?
ప్రధానమంత్రి టీబీ ముక్త్ అభియాన్‌లో భాగంగా టీబీ లక్షణాలున్న వారిని గుర్తించి స్పూటమ్ పరీక్ష చేస్తున్నాం. ఈ ఏడాది 16,804 మందికి పరీక్ష చేయగా 1,112 మంది టీబీ ఉన్నట్లు తేలగా వారందరికీ రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు, మందులు అందించాం. ఇప్పుడు 94శాతం మంది రికవరీ అయ్యారు. టీబీ నివారణలో జిల్లా 5వ స్థానంలో ఉంది.
ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రసవాలు ఎక్కువ అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి ?
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో 64.56 శాతం, ప్రైవేట్ ఆస్పత్రులలో 35.44 శాతం ప్రసవాలు జరిగాయి. ప్రసవం కోసం గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రులకే తీసుకెళ్లాలని ఆశ వర్కర్లకు ఆదేశించాం. సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపునకు ప్రత్యేక చర్యలు చేపడతాం.
మెరుగైన సేవలందిస్తా..


