
ఎరువుల కొరత లేకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కల్తీ విత్తనాలు, ఎరువులను విక్రయించే దుకాణాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఖరీఫ్‌లో రైతులకు పంపిణీ చేయడానికి ఇప్పటికే జిల్లాకు 25 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీల ద్వారా రైతులకు పంపిణీ చేశామన్నారు. మరో 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇంకా ఎంత అవసరం ఉంటుందో నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. జిల్లాకు నిర్దేశించిన 2,500 ఎకరాలలో పామాయిల్ తోటల పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి 200 ఎకరాలను టార్గెట్‌గా నిర్దేశించుకుని తోటల పెంపకం లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, డీఏవో తిరుమల ప్రసాద్, ఏఎస్పీ నర్సింహారెడ్డి, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, ఏడీఏలు పాల్గొన్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే కేసులు పెట్టండి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్