ప్రమాదవశాత్తు కంటైనర్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు కంటైనర్‌ దగ్ధం

Jul 5 2025 6:36 AM | Updated on Jul 5 2025 6:36 AM

ప్రమా

ప్రమాదవశాత్తు కంటైనర్‌ దగ్ధం

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని దగ్గి గ్రామ శివారులోగల 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఓ కంటైనర్‌ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. నిజామాబాద్‌ వైపు నుంచి హైదరాబాద్‌ వైపునకు వెళ్తున్న కంటైనర్‌ దగ్గి శివారులోకి రాగానే వాహనం నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. లారీలో ఉన్న వివిధ రకాల పార్సిళ్లు, కొరియర్‌ వస్తువులు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న సదాశివనగర్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

ఒకరి రిమాండ్‌

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల గ్రామానికి చెందిన లెగ్గల రాజు అనే వ్యక్తిని రిమాండుకు తరలించినట్లు ఎస్సై వెంకట్రావు శుక్రవారం తెలిపారు. లింగంపేటకు చెందిన చాకలి రాకేష్‌ను ఏప్రిల్‌ 14న రాత్రి సమయంలో రాజు చంపడానికి ఇనుప రాడ్‌తో దాడి చేసి గాయపరిచాడన్నారు. ఈ ఘటనపై రాకేష్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రాజును గురువారం రాత్రి అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

గంజాయి విక్రేత పట్టివేత

ఖలీల్‌వాడి: నగర శివారులోని దుబ్బ బైపాస్‌ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సీఐ వెంకటేష్‌ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎకై ్సజ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం శుక్రవారం సాయంత్రం బైపాస్‌ రోడ్డులో నిఘా ఉంచగా, రెంజల్‌ మండలం నీలా గ్రామానికి చెందిన పుల్లె లక్ష్మీనర్సింహ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 250 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై నర్సింహచారీ, హెడ్‌ కానిస్టేబుళ్లు భూమన్న, రాజన్న, కానిస్టేబుళ్లు భోజన్న, విష్ణు, అవినాష్‌, సాయి కుమార్‌, రాంబచ్చన్‌ ఉన్నారు.

డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు

బోధన్‌: పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించగా రాకాసీపేటకు చెందిన అర్షద్‌ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి శుక్రవారం బోధన్‌ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి శేషతల్ప సాయి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని టౌన్‌ సీఐ వెంకట నారాయణ తెలిపారు.

చెరువులో పడి ఒకరి మృతి

బోధన్‌: ఎడపల్లి మండలం ధర్మారం గ్రామ శివారులోని సిద్ధ చెరువులో ఓ వ్యక్తి చెరువులో పడి మృతిచెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ధర్మారం గ్రామానికి చెందిన మేకల ప్రశాంత్‌ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

అక్రమ నిర్మాణం తొలగింపు

బీబీపేట: మండల కేంద్రంలోని స్థానిక వారాంతపు సంత వద్ద అక్రమంగా నిర్మించిన దుకాణం డబ్బాను శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్‌ తొలగించారు. గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం అందించకుండా రాత్రి వేళలో నిర్మించడంతో ఉదయాన్నే అధికారులు తొలగించారు. నిర్మించిన వారిని పిలిపించి మందలించారు.

ప్రమాదవశాత్తు కంటైనర్‌ దగ్ధం
1
1/1

ప్రమాదవశాత్తు కంటైనర్‌ దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement