
వెంకట్ రాములు (ఫైల్)
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పయ్యావుల వెంకట్ రాములు (58) ఆర్టీసీ బస్సులో గుండె పోటుతో మృతి చెందాడు. బుధవారం ఉదయం ఛాతీలో నొప్పి రాగా వెంకట్ రాములు భార్యతో కలిసి నిజామాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్తుండగా బస్సులోనే కూర్చున్న చోట ప్రాణాలు విడిచాడు. భార్య బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
మాచారెడ్డి: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్ సూచించారు. బుధవారం రాత్రి ఘన్పూర్(ఎం)లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఫోన్‌లో బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే చెప్పొద్దన్నారు. బ్యాంకుల వద్ద అనుమానిత వ్యక్తులు ఖాతా వివరాలు అడిగితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. పోలీస్ కళాబృందం సభ్యులు ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. వాహనాల తనిఖీలో ధ్రువీకరణ పత్రాలు లేని 50 బైక్‌లను సీజ్ చేశారు. కార్యక్రమంలో మాచారెడ్డి ఎస్సై సంతోష్ కుమార్, మహిళా ఎస్సై జ్యోతి, దేవునిపల్లి ఎస్సై గాంధీగౌడ్, సర్పంచ్ లత, ఉప సర్పంచ్ మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.