శరణు..శరణు
బిక్కవోలు: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి వేడుకలు జిల్లాలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. జిల్లాలోనే పేరు గాంచిన బిక్కవోలు ప్రాచీన గోలింగేశ్వరస్వామి ఆలయంలో కొలువైన శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ పల్లె శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజాము 1.10 గంటలకు తీర్థపు బిందె సేవతో షష్ఠి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామి సేవ అనంతరం దర్శనం కోసం భక్తుల వెల్లువ కొనసాగింది.
నాగుల చీరలు ధరించి..
భక్తులు గోదావరి కాలువలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సంతానం లేని మహిళలు ఆలయం వెనుక నాగులు చీరలు ధరించి నిదురించారు. 9 గంటలకు స్వామివారికి నెమలి వాహనంలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాండ్ కచేరీలు వచ్చిన భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సాధారణ దర్శనానికి మూడ గంటలు, వీఐపీ, రూ.100 దర్శనాలకు రెండు గంటల సమయం పట్టింది.
భక్తులకు వితరణ
ఆలయానికి వచ్చిన భక్తులకు, చిన్నారులకు పలు స్వచ్ఛంద సంస్థలు తాగునీరు, పాలు, మజ్జిగ, బిస్కట్లు పంపిణీ చేశాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకూ భారీ స్థాయిలో జరిగిన బాణసంచా కాల్పులను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్యాండ్ మేళాలు, కోయ డ్యాన్సులు, గరగ నృత్యాల నడుమ రాత్రి 11 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. అనంతరం రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ బాణసంచా ప్రదర్శనలు నిర్వహించారు.
అంగరంగ వైభవంగా షష్ఠి వేడుకలు
సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేక పూజలు
కిటకిటలాడిన ఆలయాలు
బిక్కవోలుకు పోటెత్తిన భక్తులు
శరణు..శరణు


