మరో చంద్రజాలం | - | Sakshi
Sakshi News home page

మరో చంద్రజాలం

Nov 20 2025 6:40 AM | Updated on Nov 20 2025 6:40 AM

మరో చంద్రజాలం

మరో చంద్రజాలం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సార్వత్రిక ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు ప్రభుత్వం ఒకటొకటిగా తూట్లు పొడుస్తూ వస్తోంది. రైతే ఈ రాష్ట్రానికి వెన్నెముక అని ఎన్నికల ముందు చంద్రబాబు ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా గద్దె నెక్కగానే రైతులను చిన్నచూపు చూస్తున్నారు. ఇచ్చిన హామీలను కూడా గాలికొదిలేసి రోడ్డు పాల్జేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పెట్టుబడి సాయాన్ని పెంచి ప్రతి రైతుకు రూ.20వేలు అన్నదాత సుఖీభవ అందిస్తానని చంద్రబాబు ప్రకటించారు. బాబు మాటలు నమ్మి రైతులు అన్నదాత సుఖీభవ కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడచిపోయింది. చంద్రబాబు గత ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేసి రైతులకు నిలువునా దగా చేశారు. గతేడాది బాబు మాటలు నమ్మి మోసపోయిన రైతుల సంఖ్య జిల్లాలో 1.80 లక్షలకు పైమాటే. ఈ ఏడాది చూస్తే కొందరికి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా ఎగనామం పెట్టారని రైతులు మండిపడుతున్నారు.

గతేడాది పెట్టుబడి సాయం కోసం గంపెడాశతో రైతులు ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. సాయం అందిస్తామని ఇచ్చిన హామీనే చంద్రబాబు తొలి ఏడాది గోదాట్లో కలిపేశారు. ఽప్రస్తుతం రెండవ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ కూడా తుది దశలో ఉంది. పెట్టుబడి సాయం మాత్రం రైతులకు ప్రభుత్వం ఇవ్వకుండా దగా చేసిందని రైతులు మండిపడుతున్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2 వేలు వంతున రైతుల ఖాతాల్లో జమ చేసేసింది. కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు ఇప్పటికే రైతుల ఖాతాలో జమ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌ ముగిసే సమయానికి (బుధవారం కొందరు రైతుల ఖాతాల్లో జమ) కొందరికి ఇచ్చి మరికొందరి పట్ల దయలేని ప్రభుత్వంగా మిగిలిపోయింది.

అప్పట్లో క్రమం తప్పకుండా

రైతు భరోసా

రైతులు సాగుకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే సంకల్పంతో రైతు భరోసా సొమ్ము సకాలంలో ఖాతాల్లో జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారు. ఖరీ్‌ఫ్‌ సాగుకు సమాయత్తమయ్యే రైతులకు భరోసా కల్పిస్తూ మే నెలలో రూ.7,500 జమ చేసేవారు. అక్టోబర్‌ నెలలో ఖరీఫ్‌ పంట కోతలతో పాటు రబీ సాగు అవసరాల కోసం రెండవ విడతలో రూ.4,000 జమ చేసేవారు. మూడో విడతగా జనవరి నెలలో మరో రూ.2,000 ప్రతి రైతుకు జమచేసి రైతుల ఇంట సంక్రాంతి పండగను తీసుకువచ్చారు. ఇలా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున రైతుల ఖాతాల్లో ఏటేటా జమ చేశారు. చివరకు కోవిడ్‌ కష్టకాలంలో సైతం రైతు భరోసా నిధులు జమ చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసాతోపాటు వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఇన్‌పుడ్‌ సబ్సిడీ ఇలా అనేక పథకాల ద్వారా జగన్‌ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది.

అధికారంలోకి వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ సాయంగా ఏటా రూ.20వేలు వంతున ఒక్కో రైతుకు జమ చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో గొప్పగా ప్రకటించారు. బాబు ఏటా ఇస్తానన్న రూ.20 వేలు మొదటి ఏడాది రైతులకు ఎగనామం పెట్టారు. ఇప్పుడు కూడా వేలాది మంది అర్హులైనవారికి ఈ పథకం అందచేయకుండా చంద్రబాబు సర్కార్‌ దగా చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడులు రాక.. గిట్టుబాటు కాక

అన్నదాత సుఖీభవ ద్వారా జిల్లాలోని లక్షా 50వేల 475 మంది రైతులకు రూ.99.8 కోట్లు బుధవారం విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కిసాన్‌ ద్వారా రూ.2,000, అన్నదాత సుఖీభవ ద్వారా రూ.5000 కలిపి మొత్తంగా రైతుకు రూ.7,000 వంతున రెండో విడతగా జమ చేశారు. జిల్లాలో 1.80 లక్షలకు పైగానే రైతులు ఉన్నారని అంచనా. ఈ లెక్కన చూసుకున్నా 30వేల పై చిలుకు రైతులకు అన్నదాత సుఖీభవ లేకుండా ఎగనామం పెట్టినట్టేనంటున్నారు. ఖరీఫ్‌ పంట చేతికందే దశలో మోంథా తుపాను దెబ్బకు రైతులు కుదేలైపోయారు. దిగుబడులు సగానికి పడిపోయి, దక్కిన ధాన్యం తడిసిపోవడంతో సరైన ధర లేక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎకరాకు రూ.40వేల పై చిలుకు పెట్టుబడులు కాగా రూ.20 వేల నుంచి రూ.25వేలు కూడా గిట్టుబాటు కాక లబోదిబోమంటున్నారు. ఈ తరుణంలో అన్నదాత సుఖీభవ వస్తుందని తెలిసి సంతోషపడ్డారు. కుంటిసాకులతో అన్నదాత సుఖీభవ లేకుండా చేయడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అన్నదాతకు అండగా జగన్‌

ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల విత్తనాలు కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది పడకుండా జగన్‌ సర్కార్‌ సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తూ వచ్చింది. కేంద్రం నుంచి ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ఇచ్చే రూ.6000కు నాడు జగన్‌ రైతు పక్షపాతిగా మరో రూ.7,500 కలిపి మొత్తం రూ. 13,500 చొప్పున ఒక్కో రైతు ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. జిల్లాలో 1.80 లక్షలకు పైగా రైతులు ఈ ఐదేళ్లలో కేవలం రైతు భరోసా ద్వారానే రూ.1,121 కోట్ల లబ్ధి పొందారు.

‘అన్నదాత సుఖీభవ’ ఆశలు గల్లంతు

30 వేల మందికి మొండిచేయి

కౌలు రైతులకు కుచ్చుటోపీ

ఇప్పటికే ఖరీఫ్‌ నష్టపోయిన వైనం

జగన్‌ సర్కార్‌లో రూ.1,121 కోట్ల లబ్ధి

కౌలు కార్డులతో సరి

జిల్లాలో సుమారు 65 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. ఇందులో 13 నుంచి 15 వేల మంది కౌలు రైతులు అన్నదాత సుఖీభవకు అర్హులుగా గత ప్రభుత్వంలోనే తేల్చారు. గత జగన్‌ ప్రభుత్వంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కౌలు రైతులందరికీ వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు మొండిచేయి చూపించింది. ఇప్పటికే ఈ వర్గాలకు పంట రుణాలు ఇవ్వక కేవలం కౌలురైతులకు కౌలు కార్డులు ఇచ్చి చేతులు దులుపేసుకుంది. ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కౌలురైతులకు ఒక్క రూపాయి కూడా జమ చేయకుండా దగా చేసింది. గత ప్రభుత్వం మాదిరిగానే తమకు పథకం వర్తిస్తుందని ఎదురుచూసిన కౌలు రైతులను చంద్రబాబు సర్కార్‌ నిలువునా దగా చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement