యూనిటీ మార్చ్‌తో యువతలో ఐక్యతా భావం | - | Sakshi
Sakshi News home page

యూనిటీ మార్చ్‌తో యువతలో ఐక్యతా భావం

Nov 18 2025 6:09 AM | Updated on Nov 18 2025 6:09 AM

యూనిట

యూనిటీ మార్చ్‌తో యువతలో ఐక్యతా భావం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): యువతలో ఐక్యత భావం, దేశ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ఐక్యత మార్చ్‌ (యూనిటీ మార్చ్‌)ను నిర్వహించినట్టు కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్‌ మనీషా అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్‌ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఐదు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. స్థానిక కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌ నుంచి సాంబమూర్తి నగర్‌ ఆదిత్య ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీ వరకు నిర్వహించిన ఈ పాదయాత్రను ట్రైనీ కలెక్టర్‌ మనీషా, ఏఆర్‌ అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పాదయాత్ర భానుగుడి జంక్షన్‌, కోకిల రెస్టారెంట్‌, మదర్‌థెరిస్సా సెంటర్‌ మీదుగా ఆదిత్య కళాశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ, దేశానికి సర్దార్‌ పటేల్‌ చేసిన సేవలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్బోధించారు. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్‌ ఎన్‌.శేషారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

స్టీల్‌ ప్లాంట్‌పై బాబు మార్క్‌ కుతంత్రాలు

వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర

ఉపాధ్యక్షురాలు నాగమణి

కాకినాడ రూరల్‌: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు తన మార్కు కుత్రంతాలకు పాల్పడుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు బహిర్గతం చేస్తున్నాయని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆరోపించారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులపై చంద్రబాబు నోరు పారేసుకోవడం తగదన్నారు. కాకినాడలో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు, ఉద్యోగులకు జీతాలు ఎందుకంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయబోమని ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పారని, రేవు దాటాక తెప్ప తెగలేసినట్టుగా.. ఇప్పుడు ఉద్యోగులు, కార్మికులపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ, విశాఖ ఉక్కు కర్మాగారంపై తెల్ల ఏనుగంటూ మాట్లాడుతున్నారన్నారు. అమరావతి రాజధానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, దాన్ని తెల్ల ఏనుగు అంటారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ భూములపై కన్ను వేసి, కర్మాగారాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్ల ప్యాకేజీ ఎలా వినియోగించారనేది చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉత్పాదన ఉద్యోగికి సగటున 785 టన్నులు కాగా, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ సగటున 629 టన్నులు మాత్రమేనన్నారు. సొంత గనులు లేకుండా విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల బారిన పడుతుందంటూ చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు. ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్‌కు గనులు కేటాయించేందుకు ఉన్న ఆసక్తిని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై పెడితే కచ్చితంగా లాభాల బాట పడుతుందని చంద్రబాబు గ్రహించాలని హితవు పలికారు.

పీజీఆర్‌ఎస్‌కు 382 అర్జీలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 382 అర్జీలు సమర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావుతో పాటు, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. రేషన్‌ కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్య నిర్వహణ, వివిధ సంక్షేమ పథకాలు తదితర అంశాలపై అర్జీలు అందాయి. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు నిర్దేశించారు.

రాష్ట్ర స్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీలకు ఎంపిక

అమలాపురం టౌన్‌: అమలాపురంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు బీహెచ్‌వీఎస్‌ రామకృష్ణ సోమవారం తెలిపారు. ఇందులో అండర్‌–17 విభాగానికి ఎ.శిరీష, అండర్‌–14 విభాగానికి పి.వినయ్‌కృష్ణ ఎంపికయ్యారన్నారు. ఈ నెల 20న చిత్తూరులో జరగనున్న పోటీలకు వినయ్‌కృష్ణ, 21న నూజివీడులో జరిగే పోటీల్లో శిరీష పాల్గొంటారని అన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

యూనిటీ మార్చ్‌తో యువతలో ఐక్యతా భావం 1
1/1

యూనిటీ మార్చ్‌తో యువతలో ఐక్యతా భావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement