అరటి ఆకులో ఆహారం
ఫ ‘కార్తికం’తో పెరిగిన ధర
కార్తిక మాసంలో అరటి ఆకులోనే భోజనం చేయాలనేది అనాదిగా వస్తున్న ఆచారం.. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో రకరకాల ఆకృతుల్లో, వివిధ రకాల మెటీరియల్స్‌తో రూపొందించిన భోజనం ప్లేట్లు వచ్చినా అరటి ఆకుకు ఉన్న డిమాండ్ తగ్గలేదు. కార్తిక మాసంలో అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ కార్తికంలో భోజనానికి అరటి ఆకునే వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో అరటి ఆకులకు డిమాండ్ ఏర్పడింది.
సాధారణ రోజుల్లో 100 అరటి ఆకులు రూ.100 వరకూ ధర పలుకుతుండగా, కార్తిక మాసం ప్రారంభంలో ఒక్కసారిగా ధర పెరిగింది. ప్రస్తుతం వంద అరటి ఆకులు రూ. 300 పలుకుతున్నాయి. అయ్యప్ప భక్తులు కూడా అరటి ఆకులోనే భోజనాలు చేస్తారు. విస్తరిలు అందుబాటులో ఉన్నా భోజనం చేయరు. కార్తిక మాసం, అయ్యప్పల సంఖ్య పెరగడం.. వన భోజనాల హడావుడితో అరటి ఆకులకు సహజంగానే డిమాండ్ ఏర్పడినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద కార్తిక వనభోజనాలు చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. జిల్లాలో అరటి తోటల సాగు అధికంగానే ఉంది. 12,300 హెక్టార్లలో అరటి పంటను సాగు చేస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఈ నెలలో వచ్చిన మోంథా తుపాను కారణంగా వీచిన గాలులకు అరటి తోటలు పడిపోవడం.. ఆకులు చీలిపోవడంతో అరటి ఆకులు దొరకడం కష్టంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఆరోగ్యానికి మేలు
అరటి ఆకులో భోజనం చేయడం ఆరోగ్య రీత్యా మంచిదని, అందుకే పూర్వకాలం నుంచి అరటి ఆకులో భోజనం చేయడం సంప్రదాయంగా వస్తుంది. సంప్రదాయంతో పాటు అరటి ఆకులో నుంచి శరీరానికి అవసరమైన సహజ సిద్ధమైన ఔషధాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. అరటి ఆకులో వేడి వేడి ఆహార పదార్థాలతో యాంటీ ఆక్సిడెంట్స్ కలసి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని పలువురి నమ్మకం.
– రాయవరం


