రైతు సమస్యలపై సమర శంఖం | - | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై సమర శంఖం

Jul 3 2025 5:34 AM | Updated on Jul 3 2025 5:34 AM

రైతు

రైతు సమస్యలపై సమర శంఖం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: నెల దాటినా ధాన్యం సొమ్ము ఇవ్వరు...అదను దాటిపోతున్నా మెట్టలో ఖరీఫ్‌కు సాగునీరు ఇవ్వరు...ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వదు...కానీ రైతులపై భారం మోపుతూ సర్‌చార్జీలతో కలిపి నీటి తీరువా వసూలు చేస్తామంటారు...మెట్ట ప్రాంతంలో ఖరీఫ్‌ సాగుకు నీరు విడుదలపై స్పష్టత ఇవ్వరు...కోనసీమలో మేజర్‌ డ్రైన్‌లు పట్టించుకోకుండా ఖరీఫ్‌ ఎలా ముందుకు సాగేది...అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వేదికగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలపై సభ్యులు మూకుమ్మడిగా నిలదీసి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కోట్లాది రూపాయల ధాన్యం సొమ్ము జమ చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ తీరును రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తప్పుపట్టారు. జెడ్పీటీసీ సభ్యులు కూడా ప్రభుత్వ తీరును మూకుమ్మడిగా నిలదీశారు. ధాన్యం సొమ్ము కోట్లలో బకాయిలున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు, 24 గంటల్లో జమచేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పి రైతులను నట్టేట ముంచేసిందని మండిపడ్డారు.ఽఖరీఫ్‌ పెట్టుబడుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో వైఎస్సార్‌ సీపీ నుంచి కూటమికి ఫిరాయించిన జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బుర్రా అనుబాబు కల్పించుకుని ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేద్దామనడంతో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఒక్కసారిగా అనుబాబుపై విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయించిన మీకు రైతుల కోసం మాట్లాడే అర్హత లేదంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రైతులంటే లెక్కలేదంటూ సభ్యులు నినాదాలు చేస్తూ వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

నీటి తీరువా వసూలుపై ఆగ్రహం

కొద్దిసేపు సమావేశం బయట నిరసన వ్యక్తం చేసిన అనంతరం తిరిగి సభకు వచ్చారు. ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమయ్యే తరుణంలో ప్రభుత్వం ఇస్తామన్న పెట్టుబడి ఇవ్వకపోగా నీటితీరువా వసూలు చేయడం అన్యాయమంటూ గొల్లప్రోలు, ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, బెహరా రాజరాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లో పెట్టుబడులు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే అన్యాయంగా సర్‌చార్జీలతో కలిపి నీటితీరువా ఎలా వసూలు చేస్తారని సభ్యులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి కల్పించుకుని సర్‌చార్జీలు వసూలు చేసే ఆలోచన లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటితీరువా కచ్చితంగా వసూలు చేయడం తప్పదన్నారు. రైతులకు సంబంధించి ప్రాధాన్యం కలిగిన ఈ అంశంపై కూటమి ప్రజాప్రతినిధులు పెదవి విప్పకుండా మిన్నకుండి పోవడం ఏమిటని పలువురు సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు.

ప్రజాధనం వృథా : ఎమ్మెల్సీ తోట

పీడీఎస్‌ బియ్యాన్ని చేరువలో ఉన్న ఆలమూరు, రామచంద్రపురంలోని గోడౌన్లలో కాకుండా ద్వారపూడిలోని ప్రైవేట్‌ గోడౌన్‌లో నిల్వచేయడం ద్వారా ప్రజాధనం వృథా అవుతోందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభ దృష్టికి తెచ్చారు. ఇరిగేషన్‌ అధికారులు ఖరీఫ్‌ సాగునీటి ప్రణాళికను వివరిస్తూ గోదావరి మూడు డెల్టాల పరిధిలో 10.13 లక్షల ఎకరాలకు జూన్‌ ఒకటిన నీరు విడుదల చేశామన్నారు. గోదావరి డెల్టాలకు విడుదల చేసినట్లే, మెట్ట ప్రాంతంలోని ఏలేరు, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్‌ ల కింద ఉన్న 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా జూన్‌ 1 నుంచి ఎందుకు నీరు విడుదల చేయలేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిలదీశారు. ఇరిగేషన్‌ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలువలలో మానవ విసర్జితాలను వదులుతున్నా ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్‌–1 నాటికి పురుషోత్తపట్నం వద్ద కనీస నీటి మట్టం స్థాయి 14 అడుగులకు దిగువకు ఉన్నందున ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతానికి నీటి విడుదల సాధ్య పడలేదని కాకినాడ కలెక్టర్‌ షణ్మోహన్‌ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం 14.5 అడుగుల స్థాయికి జలాలు ఉన్నందున పుష్కర ద్వారా గురువారం నుంచి నీటి సరఫరా జరుగుతుందని, మిగిలిన మెట్ట ప్రాంత ప్రాజెక్టుల ద్వారా జూలై 15 నుంచి నీరు విడుదల చేస్తామన్నారు. పారిశ్రామిక కాలుష్యాలతో తుల్యభాగ నీరు విషతుల్యమవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుల్యభాగ కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి పేర్కొన్నారు. కోనసీమలో కూనవరం డ్రైన్‌ వెంబడి చల్లపల్లి –చింతలపూడి లాకుల వరకూ ఉప్పునీరు వెనుకకు తన్నుకు రావడంతో వందలాది ఎకరాల్లో సేద్యం దెబ్బతింటోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ కల్పించుకుని పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ, డ్రైనేజీ బోర్డు ఏర్పాటుకు చైర్‌పర్సన్‌ వేణుగోపాలరావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒకే ఆధార్‌ నంబర్‌తో మూడు కరెంటు మీటర్లు ఉండటంతో తల్లికి వందనం మంజూరు కాకపోవడం తగదని, గ్రామ పంచాయతీలకు 2023 నుంచి స్టాంపు డ్యూటీ జమ చేయాలని, ధాన్యం సొమ్ము సత్వరం చెల్లించాలని, గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతో సీజనల్‌ వ్యాధులను నివారించాలని, మండలాల్లో చేసిన పనులకు చెల్లింపులు చేపట్టాలని జెడ్పీటీసీలు విజ్ఞప్తి చేశారు. రంపచోడవరం మన్యం ప్రాంతంలో రహదారులు అధ్వానంగా మారాయని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్సీ అనంతబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు.

ఉమ్మడి తూర్పుగోదావరిలో సాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణకు, డ్రైనేజీ బోర్డు పునరుద్ధరణకు ప్రభుతాన్ని కోరుతూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత రాజోలు ఎంపీపీ అధ్యక్షుడు కేతా శ్రీనివాసరావు ఆకస్మిక మృతికి సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. కాకినాడ జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ మనీషా, జెడ్పీ సీఈఓ వీవీవీఎస్‌ లక్ష్మణరావు పాల్గొన్నారు.

ధాన్యం సొమ్ము ఎప్పుడిస్తారు

మెట్టకు సాగునీరు మాటేమిటి?

జెడ్పీ సమావేశంలో గళమెత్తిన సభ్యులు

రైతు సమస్యలపై సమర శంఖం1
1/2

రైతు సమస్యలపై సమర శంఖం

రైతు సమస్యలపై సమర శంఖం2
2/2

రైతు సమస్యలపై సమర శంఖం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement