
అన్నదాత ఇంట.. సిరుల పంట
ఆలమూరు: వ్యవసాయంలో అధిక పెట్టుబడిని, కూలీల కొరతను ఎదుర్కొనేందుకు రైతులు అనేక అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. దీంతో వరి సాగులో ఏటా అనేక మార్పులు సంభవిస్తూ, వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుంది. అత్యాధునిక, పురాతన సంప్రదాయాలతో వ్యవసాయం చేపట్టడం ద్వారా రైతులు పెట్టుబడిని నియంత్రించుకుని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో దిగుబడి ఆశాజనకంగా ఉన్నా, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఈ సీజన్‌లో ధాన్యం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయకపోయినా, అన్నదాత సుఖీభవ అమలు చేయకపోయినా రైతులు మాత్రం ఖరీఫ్ సీజన్‌లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలు, కూలీల కొరత వల్ల పెట్టుబడిని తగ్గించుకునేందుకు ఈసారి అధికంగా రైతులు వినూత్న రీతిలో వెదజల్లు సాగు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 1.64 లక్షల ఎకరాల్లో 1.06 లక్షల మంది రైతులు వ రిసాగు చేపట్టారు. స్వర్ణ (7029)కు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ (1318), ఎంటీయూ (1121) రకాలు వినియోగించాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ కొత్త వంగడాల వల్ల నారుమడులు సరైన రీతిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే, చీడపీడలు నివారించి నష్ట నివారణను అరికట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు.
స్వర్ణ (7029)కే రైతుల మొగ్గు
రైతులు మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ (7029) రకానికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సీజన్‌లో 70 శాతం మేర స్వర్ణ రకం సాగు చేస్తుండగా, మిగతా ఇతర రకాలను సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సాగుకు 35 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేయగా, రైతుల నుంచి సుమారు మూడు వేల క్వింటాళ్ల సేకరణ ఇప్పటికే జరిగింది. ప్రస్తుతం వివిధ గ్రామాల్లో దాదాపు వెయ్యి క్వింటాళ్ల విత్తనాలు ఆర్‌ఎస్‌కేలకు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతోంది. ఈ సీజన్‌లో సుమారు 80 శాతం మేర వెదజల్లు సాగును ఎంచుకోగా, మిగిలిన రైతులు వరినాట్ల పద్ధతిని అవలంబిస్తున్నారు. సాగునీటి ఎద్దడి దృష్ట్యా వ్యవసాయ శాఖ ఈ నెల 15 నాటికి నాట్లు పూర్తి చేయాలని సూచించడంతో, రైతులు పనులను వేగవంతం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా వెదజల్లు వల్ల లాభాలపై అవగాహన కల్పించడంతో రైతులు ఈ విధానంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది విత్తనాలు రైతులకు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో, సమయానికి ముందే రైతులు సాగు చేపట్టారు. డ్రమ్ సీడర్ వినియోగంతో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా, రైతులకు అంతగా అవగాహన లేకపోవడంతో ఆ దిశగా చర్యలు చేపట్టలేదని అంటున్నారు.
కలుపు యాజమాన్య పద్ధతి
పంట తొలి దశలో నీరు నిలగట్టక ఆరుతడిగా సాగు చేయడం వల్ల కలుపు సమస్య అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పద్ధతిలో కలుపు మందును తప్పనిసరిగా వాడాలి. ఎకరాకు 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ లేదా ప్రెటిలాక్లోర్ మందును ఎకరాకు 400 మి.లీ లేదా పైరజో సల్ఫ్యురాన్ ఇథైల్ 100 గ్రాముల మందును 20 కిలోల పొడి ఇసుకలో కలపాలి. ఈ మందును వెదజల్లు విధానంలో విత్తిన 3–5 రోజుల్లో పొలంలో పలచగా, నీరు పెట్టి కలుపు మందును పిచికారీ చేయాలి. తర్వాత పొలంలో నీరు తీసి వేయడం ద్వారా కలుపును నివారించవచ్చు. రెండో దశ నుంచి పొలంలో ఏర్పడిన కలుపును మొక్కల మధ్ద తొక్కడం ద్వారా ఎరువుగా మలచుకోవచ్చు.
నీటి యాజమాన్యం
విత్తనం వేసినప్పటి నుంచి పొట్ట దశ వచ్చే వరకూ పొలంలో నీరు నిల్వ ఉండకుండా కేవలం బురదగా మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కువైన నీటిని బయటకు పోవడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వరి కంకి వేర్లు ఆరోగ్యంగా పెరిగి, ఎక్కువ పిలకలకు అవకాశం ఉంటుంది. పైరు పొట్ట దశ నుంచి పంట కోసే పది రోజుల ముందు రెండు సెం.మీ. నీరు నిల్వ ఉండేలా చూడాలి.
డ్రమ్ సీడర్ పద్ధతిలో..
దమ్ము చేసిన అనంతరం చదును చేసిన భూమిలో పలచటి నీటి పొర ఉండేలా చూసుకుని, మండి కట్టిన విత్తనాన్ని చల్లాలి. డ్రమ్ సీడర్ పరికరానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సె.మీ. దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూతను బిగించాలి. గింజలు నింపి, డ్రమ్ సీడర్‌ను లాగితే ఎనిమిది వరుసల్లో 20 సెం.మీ. దూరంలో గింజలు పడతాయి. దీంతో వరుసల్లో కుదురు కుదురుకు మధ్య దూరం 5–8 సెం.మీ. దూరం ఉంటుంది. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పులో కాలిబాటలు వేసుకోవాలి. తాడు లాగి డ్రమ్ వాడితే వరుసలు బాగా వచ్చి, విత్తు సక్రమంగా ఉంటుంది.
ఖరీఫ్ సీజన్‌లో వెదజల్లుపై రైతుల ఆసక్తి
పెట్టుబడి ఆదా.. అధిక దిగుబడి
డ్రమ్ సీడర్ పద్ధతితో మరింత మేలు
కనీస జాగ్రత్తలు కీలకం
వెదజల్లు సాగు విధానంలో కనీస జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు చెబుతున్నారు.
వెదజల్లు విధానంలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. మరుసటి రోజు ఆ విత్తనాలను గోనె సంచె కప్పి నిల్వ ఉంచాలి. విత్తనం ముక్కు పగిలి తెల్లగా మోసు వచ్చే క్రమంలో పొలంలో విత్తనాలను వెదజల్లాలి.
విత్తనాలకు మొక్కలు వచ్చే వరకూ పొలంలో నీరు లేకుండా కాలువలు ఏర్పాటు చేసి, నీటిని బయటకు పంపాలి.
వారం తర్వాత ఒకసారి పంటకు నీరును అందజేసి, మరుసటి రోజు తొలగించాలి.
దమ్ము చేసే సమయంలో పొలంలో ఎగుడుదిగుడులు లేకుండా నేలను సమాంతరంగా ఉండేలా చూడాలి.
ఎకరానికి 16 నుంచి 20 కిలోల విత్తనాలను నాటాలి. వరినాట్లు నాటే 15 రోజుల ముందు ఒకసారి దమ్ము చేయాలి.
నాలుగు రోజుల ముందుగా చదును చేయాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలను ఏర్పాటు చేయాలి.
కలుపు నివారణకు బింతియోకార్బ్ లేదా అనిలోఫాస్ 1.25 లీటర్ల మందును 27 కిలోల ఇసుకలో కలిపి చల్లితే కలుపును నివారించవచ్చు.
వెదజల్లుతో ప్రయోజనాలు
తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, కూలీల కొరతను అధిగమించవచ్చు.
సాగునీటి ఎద్దడిని అధిగమించవచ్చు. పంట పది రోజుల ముందే కోతకు వస్తుంది. భూమి సారవంతమవుతుంది.
మొక్కలో సాంద్రత పెరిగి, పది శాతం మేర అధిక దిగుబడికి అవకాశం ఉంది.
సాధారణ పద్ధతిలో వరి సాగుకు ఎకరం పొలంలో నారుమడికి 30 కేజీల విత్తనాలు అవసరం. వెదజల్లులో కేవలం 12 నుంచి 18 కేజీలు చాలు.
కలుపు మొక్కలను సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ఎరువుగా మలుచుకోవచ్చు.
నారుమడులు పోసి ఊడ్చేందుకు పట్టే ఎక్కువ సమయాన్ని, వెదజల్లు సాగుతో అరికట్టవచ్చు.
పెట్టుబడి పరంగా రూ.మూడు వేల వరకూ ఆదా అవుతుంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా, నీరు అందుబాటులో ఉన్నప్పుడే సాగుకు అవకాశం ఉంటుంది.

అన్నదాత ఇంట.. సిరుల పంట

అన్నదాత ఇంట.. సిరుల పంట