
బాలుడిని మింగిన మృత్యు కుహరం
● ఇంటి నిర్మాణం కోసం తీసిన గోతిలో పడిన వైనం
● మరో బాలుడి పరిస్థితి విషమం
శంఖవరం: స్థానిక అంబేడ్కర్ కాలనీలో ఇంటి నిర్మాణం కోసం తీసిన గోతిలో పడి ఓ బాలుడు శనివారం మృతి చెందగా మరో బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గ్రామానికి చెందిన భూర్తి మహి (7), పులి ప్రణయ్ జోష్ (7) పాఠశాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా ఎస్సీ పేటలోని అంబేడ్కర్ కాలనీలో ఇంటి నిర్మాణంలో ఉన్న గోతిలో పడిపోయారు. గోతిలో నీరు ఉండడంతో ఊపిరి ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిద్దరినీ స్థానికులు గుర్తించి రౌతులపూడి సీహెచ్‌సీకి తరలించగా మహి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రణయ జోష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భూర్తి సత్తిబాబు దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం కాగా మహేష్ మూడో కొడుకని అన్నవరం పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.