
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
● పెరిగిన కూలి
● రూ.15 పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు
● నేటి నుంచి అమలు
● జిల్లాలో 4.55 లక్షల మందికి లబ్ధి
కాకినాడ సిటీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ వేసవి నుంచి వేతనం పెరగనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పెరిగిన వేతనాలను శనివారం నుంచి కూలీలకు అందజేయనున్నారు. ఇప్పటి వరకూ ఒక్కో కూలీకి రూ.257 చెల్లిస్తూండగా ఇక నుంచి రూ.272 అందుతుంది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 4.55 లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఏటా కూలీలకు అందించే వేసవి భత్యంపై మాత్రం కేంద్రం ఎటువంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం.
లక్ష్యాలను నిర్దేశిస్తున్న కేంద్రం
ఉపాధి హామీ పథకం నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న కేంద్రం.. పని దినాల లక్ష్యాల కేటాయింపులను కూడా పర్యవేక్షిస్తోంది. కూలీల సంఖ్య ఆధారంగా గ్రామం, బ్లాక్ (మండలం), జిల్లాకు పని దినాల లక్ష్యాలను నిర్దేశిస్తోంది. గతంలో కేంద్రం నుంచి వచ్చే పని దినాల లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంత మేర పెంచుతూ జిల్లాలకు ప్రత్యేక లక్ష్యాలు ఇచ్చేది. కానీ కొత్త సాఫ్ట్‌వేర్ రావడంతో కేంద్రం సూచనలే అమలవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని సమయంలో ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య జిల్లాలో ఎక్కువగానే ఉంటోంది. ఈ ఏడాది ఉపాధి పనులను జిల్లావ్యాప్తంగా 3.22 లక్షల మంది వినియోగించుకున్నారు.
సద్వినియోగం
చేసుకోవాలి
ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు వేతనం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన వేతనం నేటి నుంచి అమలులోకి రానున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. జాబ్‌కార్డులు కలిగిన కూలీలు వేసవిలో పనులను సద్వినియోగం చేసుకోవాలి.
– అడపా వెంకటలక్ష్మి,
డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్,
కాకినాడ జిల్లా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉపాధి పనుల వివరాలు
జిల్లాలో మొత్తం బ్లాక్‌లు: 20
మొత్తం గ్రామ పంచాయతీలు: 385
జాబ్‌కార్డులు: 2,72,000
కూలీలు: 4,55,000
యాక్టివ్ జాబ్ కార్డులు : 2,06,000
పనులకు వెళ్లే కూలీలు : 3,14,000
ఇప్పటి వరకూ ఖర్చు చేసిన నిధులు:
రూ.234.11 కోట్లు
చెల్లించిన వేతనాలు : రూ.137.73 కోట్లు
మెటీరియల్ ఖర్చు : రూ.96.38 కోట్లు
