
జోగుళాంబ ఆలయంలో ట్రైనీ ఐఏఎస్‌లు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాన్ని శుక్రవారం నలుగురు ట్రైనీ ఐఏఎస్‌లు దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చకులు తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. వీరితోపాటు తహసీల్దార్ మంజుల, ఆర్‌ఐ దుర్గా సింగ్ తదితరులు ఉన్నారు.
పీజీ కళాశాల ఎదుట విద్యార్థుల నిరసన
గద్వాలటౌన్: నదీ అగ్రహారం సమీపంలో ఉన్న ప్రభుత్వ పీజీ కళాశాల ఎదుట విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పీజీ కళాశాలలో గత ఐదు రోజుల నుంచి వంట మాస్టర్ లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. వంట మాస్టర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కళాశాల ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలవురు విద్యార్థులు మాట్లాడారు. వంట మాస్టర్ లేకపోవడం వలన విద్యార్థులే వంట వండుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌కు వివరించినా ఫలితం లేదన్నారు. పీజీ కళాశాలలో 105 మంది విద్యార్థులు వివిధ కోర్సులలో చదువుతున్నారని వివరించారు. కళాశాలలో వంట మాస్టర్‌తో పాటు వార్డెన్ సైతం లేడన్నారు. తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి వంట మాస్టర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.
భూసార పరీక్షలు
తప్పనిసరి
ఇటిక్యాల: భూమిలో పోషకాలు, ఇతర గుణాలు తెలుసుకోవడానికి భూసార పరీక్షలు తప్పనిసరి అని, ప్రతి రైతు విత్తనాలు వేసే ముందు ఈ పరీక్షలు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఉదండాపురం, సాతర్ల గ్రామాలను ఆయన సందర్శించి సహజ పద్ధతిలో సాగుచేసే రైతులతో సమావేశమై మాట్లాడారు. ప్రతి ఏడాది రైతులు తమకున్న భూమిలో మట్టి పరీక్షలు చేసుకొని, ఏ పంట సాగుచేస్తే అధిక దిగుబడి వస్తుందో తెలుసుకోవాలని సూచించారు. పంటకు సరైన మోతాదులో ఎరువులు వేసేందుకు భూసార పరీక్షలు ఎంతో మేలు చేస్తాయని ఆయన వివరించారు. పంటలను సాగు చేసేందుకు రైతులు సేంద్రియ ఎరువులు అధికంగా వాడాలని సూచించారు. అనంతరం గ్రామాల్లో రైతు రిజిస్టేషన్, రైతు భరోసా కార్యక్రమాల అమలు తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి రవికుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

జోగుళాంబ ఆలయంలో ట్రైనీ ఐఏఎస్‌లు