
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఎర్రవల్లి: గురుకుల పాఠశాల, కళాశాలల్లో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాదించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం మండలంలోని బీచుపల్లి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, హాస్టల్ భవనం, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. మరుగుదొడ్లలో నీటి సరఫరా లేకపోవడంతో తక్షణమే నీటి సరఫరా కల్పించాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. హాస్టల్‌లో ఒక్క గదిలో ఎంతమంది విద్యార్థులు సౌకర్యవంతంగా ఉండగలరో అందుకు అవసరమైన బెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థుల గదిలోకి వెళ్లి వారి అధ్యయన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న మౌలిక సదుపాయాలు, వసతులు సంతృప్తికరంగా ఉన్నాయా.. లేవా అనే విషయాన్ని తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ఆశయంతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని కలెక్టర్ ప్రోత్సహించారు. అనంతరం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించి.. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియను సమీక్షించారు. ఖాళీలు ఉన్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం ఖాళీలన్నీ భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్ బ్లాక్స్, బాత్రూంలు, టాయిలెట్లు, ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఫోన్ సదుపా యం ఎలా ఉందో స్వయంగా పరీక్షించారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, మంచి ర్యాంకులు సాధించేందుకు కూ డా పూర్తి మద్దతు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్, రామాంజనేయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.