
వ్యర్థాల శుద్ధీకరణేది?
●
చర్యలు తీసుకుంటాం..
తడి, పొడి చెత్త సేకరణతోపాటు డంపింగ్ యార్డు నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. అందులోని నిర్మాణాలను వినియోగంలోకి తెస్తాం. అందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నాం. బయోమైనింగ్ పనుల జాప్యంపై సంబంధిత ఏజెన్సీకి నోటీసులు జారీ చేశాం. త్వరలోనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం.
– దశరథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల
గద్వాల టౌన్: డంపింగ్ యార్డులు అభివృద్ధి చేయండి.. వచ్చిన నిధులను సమర్థంగా వినియోగించుకుని వ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి.. ప్రజలు ఆశ్చర్యపోయేలా పారిశుద్ధ్య వ్యవస్థను తీర్చిదిద్దాలి.. ముఖ్యంగా మాంసం విక్రేతలను పిలిచి అవగాహన కల్పించి వ్యర్థాలను వాహనంలోనే తరలించేలా చూడండి.. లేదంటే బాధ్యులపై కఠినంగా వ్యవహరించండి.. అంటూ ప్రతిసారి జరిగే సమీక్షా సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చే ఆదేశాలివి. కానీ, క్షేత్రస్థాయిలో కనీస మార్పు కనిపించడం లేదు. మున్సిపాలిటీల్లో రోజువారీగా సేకరిస్తున్న చెత్తను డంపింగ్ యార్డుల్లోకి తరలించి.. అక్కడ రీసైక్లింగ్ చేసి ఎరువుగా మార్చాల్సి ఉంది. అయితే నిర్వహణలో యంత్రాంగం విఫలమవుతుంది. జిల్లాలోని గద్వాల మున్సిపాలిటీలో మాత్రమే డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మిగిలిన అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో కనీసం డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయలేదు.
8 ఎకరాల్లో డంపింగ్ యార్డు..
గోనుపాడు గ్రామ శివారులో ఎనిమిది ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. ఇందుకోసం 14వ ఆర్థిక సంఘం నుంచి 2019లో రూ.1.34 కోట్ల నిధులను కేటాయించారు. అయితే కొంతకాలంగా డంపింగ్ యార్డు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్న నిబంధనలు స్పష్టంగా ఉన్నా.. అమలు కావడం లేదు. నిత్యం పట్టణంలో సేకరిస్తున్న సుమారు 12 మెట్రిక్ టన్నుల చెత్త, ఇతర వ్యర్థాలను సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో కుప్పులుగా చెత్త నిల్వలు డంపింగ్ యార్డులో పేరుకుపోయాయి. సుమారు 10 వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త వ్యర్థాలు నిల్వ ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
గద్వాల డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త నిల్వలు
వ్యర్థాలు తరలించడంలోనూ
తప్పని ఆపసోపాలు
అయిజ, అలంపూర్, వడ్డేపల్లి
మున్సిపాలిటీల్లో కానరాని వ్యవస్థ
క్షేత్రస్థాయిలో అమలుకాని
ఉన్నతాధికారుల ఆదేశాలు
నిర్వహణలో విఫలమవుతున్న
యంత్రాంగం
పొగతో ఇబ్బందులు..
చాలా సందర్భాల్లో ప్రమాదవశాత్తు డంపింగ్ యార్డులో మంటలు చెలరేగగా.. కొన్నిసార్లు సిబ్బందే చెత్తను తగలబెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో నిత్యం పోగలు అలముకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో అయితే గాలులకే మంటలు చెలరేగుతాయి. దీంతో పరిసర పొలాల రైతులు గాలి కాలుష్యంతోపాటు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ చెత్త నిల్వలు పేర్చుకుంటూ పోవడం తప్ప.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో పట్టణానికి చెత్త నిల్వలు సవాల్‌గా మారాయి.
మూతబడిన డీఆర్‌సీ కేంద్రం..
మున్సిపాలిటీ నుంచి సేకరించిన చెత్తను వేరు చేసి తడి చెత్త కంపోస్టు ఎరువు, పొడి చెత్త నుంచి వనరులను వేరు చేయడానికి పొడి వనరుల కేంద్రం (డీఆర్‌సీ) ఏర్పాటు చేశారు. దీంతోపాటు వర్మీ కంపోస్టు కేంద్రంలో పది వరకు సెగ్రిగేషన్ షెడ్లు తదితర నిర్మాణాల కోసం రూ.1.09 కోట్లు కేటాయించారు. వీటిని నిర్మించిన ప్రారంభంలో తడి, పొడి చెత్తను వేర్వేరు చేసినా.. తదనంతరం నిరుపయోగంగా మారాయి. గత ప్రభుత్వంలోనే బయోమైనింగ్ ప్లాంటు ఏర్పాటు చేసి ప్రైవేటు ఏజెన్సీకి పనులు అప్పగించారు. సదరు ఏజెన్సీ కొన్ని నెలల పాటు ప్రారంభించి తర్వాత మధ్యలోనే ఆపేశారు.

వ్యర్థాల శుద్ధీకరణేది?

వ్యర్థాల శుద్ధీకరణేది?

వ్యర్థాల శుద్ధీకరణేది?

వ్యర్థాల శుద్ధీకరణేది?