
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా బడిబయటి పిల్లలను గుర్తించి పాఠశాలలో విద్యను అందించే లక్ష్యంతో విధులు నిర్వహించాలన్నారు. వ్యాపార సమూదాయాలు, పంట పొలాలు, హోటళ్లు, మెకానిక్ షాపులు తదితర వాటిలో పనిచేస్తున్న చిన్నారులను గుర్తించాలన్నారు. ఎవరైనా పిల్లలను పనిలోకి తీసుకుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. చిన్నారులను పాఠశాలలో చేర్పిస్తే ప్రభుత్వమే ఉచితంగా విద్యతోపాటు భోజన వసతి కల్పిస్తుందని తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్–11 ద్వారా నిరాశ్రయులైన పిల్లలు, భిక్షాటనలో బందీలైన విద్యార్థులను రక్షించి పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. అనంతరం ఆపరేషన్ ముస్కాన్–11 వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, వివిధ శాఖల అధికారులు అలివేలు, సునంద, ప్రియాంక, నిషిత, ప్రసన్నరాణి, సహదేవుడు, మహేష్‌కుమార్, పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.