
ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాలన
కాటారం/కాళేశ్వరం: సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాష్ట్రం ప్రపంచంతో పోటీపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, ముక్తీశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే మరింత ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి వేర్వేగా శనివారం పుష్కర స్నానం ఆచరించి సరస్వతి అమ్మవారు, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఎంతో పవిత్రమైనవని, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించాలని సూచించారు. రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు భారీగా నిర్వహించడానికి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, మక్కాన్‌సింగ్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, భూపాలపల్లి ఆర్డీఓ రవి, దేవాదాయశాఖ ఆర్జేసి రామకృష్ణారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సరస్వతి పుష్కరాల నిర్వహణ భేష్
ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల