
సమ్మెను విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో సోమవారం గేట్‌మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను అమ్మకానికి పెట్టి బొగ్గు పరిశ్రమను సజీవంగా సమాధి చేస్తుందన్నారు. సింగరేణిలో కొత్త బావులను అనుమతించకుండా కట్టడిచేస్తూ బొగ్గురేటును పెంచుకోకుండా అడ్డుపడుతుందన్నారు. బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం సింగరేణి బొగ్గు గనులను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి గని కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సార్వత్రిక సమ్మె పిలుపులో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ భాగస్వాములుగా ఉన్నందున సింగరేణి గని కార్మికులను భాగస్వాములను చేసేందుకు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ ముందుకు రావాలని అన్నికార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెను విజయవంతం చేసేందుకు పూనుకోవాలన్నారు. సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు దయాకర్, శంకర్, జనార్దన్, ప్రసాదరెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు.