
చెరువులు కబ్జా
శిఖం భూముల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు
● నిబంధనలు తుంగలో తొక్కిన
అఽధికారులు
● అక్రమ నిర్మాణాలపై
ఉక్కుపాదం మోపేనా..
‘ ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలిసిపోయింది.. నాలాలు కుంచించుకుపోవడం, చెరువు శిఖం, బఫర్ జోన్లు ఆక్రమణకు గురికావడంతో నీరు వెళ్లే మార్గం లేక జలవిధ్వంసం సృష్టించింది. హైడ్రాతో హైదరాబాద్‌లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. ఆక్రమణలపై మున్సిపాలిటీ, ఇరిగేషన్, రెవెన్యూశాఖ సమన్వయంతో నివేదిక తయారు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఏ నిర్మాణం ఉన్నా తొలగించాలి’.
– ఇటీవల మహబూబాబాద్‌లో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో పలు చెరువులు భూకబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడ్డారు. రెండు చెరువు శిఖం భూముల్లో అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపట్టారు. ఆలయ నిర్మాణాలకు సైతం అనుమతులు ఇచ్చి నిధులు కూడా కేటాయించారు.
కబ్జాకు గురైన చెరువులు ఇవే..
మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్‌నగర్–భూపాలపల్లి పట్టణ మధ్యలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న తుమ్మల చెరువు మొత్తం విస్తీర్ణం 22 ఎకరాలు ఉండగా.. తొమ్మిది ఎకరాల వరకు కబ్జాకు గురైంది. గోరంటాల కుంట 22.30 ఎకరాలకు తొమ్మిది ఎకరాలు కబ్జా, మహబాబుపల్లి గ్రామ సమీపంలోని సొమన్న కుంట 20 ఎకరాలకు ఆరు ఎకరాల వరకు కబ్జాకు గురైంది. జంగేడు శివారులోని తిప్పిరెడ్డికుంట 60 ఎకరాలకు ఆరు ఎకరాల వరకు కబ్జాకు గురైందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.
అఽధికారుల అండదండలతోనే..
జిల్లాకేంద్రంలో కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే చెరువు శిఖం భూములకు కబ్జాలకు గురవుతున్నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. చెరువు శిఖం భూములకు రెవెన్యూ అఽధికారులు బై సర్వే నంబర్లు వేసి పాసు పుస్తకాలు జారీ చేస్తున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రేషన్‌లో అధికారులు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అన్నీ ఉండటంతో మున్సిపల్‌శాఖ అధికారులు కళ్లకు గంతలు కట్టుకొని నిర్మాణాలకు అనుమతులు సైతం ఇస్తున్నారు. చెరువులను రక్షించుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు మాత్రం భూకబ్జాదారులతో చేతులు కలిపి చెరువు శిఖం హద్దులను తగ్గించుకుంటున్నారు.
శిఖం భూములకు రక్షణ కలిగేనా..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల మానుకోటలో ప్రకటించిన మాదిరిగా జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చేనా అని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ నేతృత్యంలో హైడ్రా మాదిరి కమిటీని ఏర్పాటుచేస్తే జిల్లాకేంద్రంలో కబ్జాలకు గురైన శిఖంభూమి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో ఉన్న చెరువులు సైతం మాయమయ్యే ప్రమాదం ఉంది.
వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలు
తుమ్మల చెరువులో సుమారు తొమ్మిది ఎకరాలు, గొరంటాల కుంటలో తొమ్మిది ఎకరాల్లో పలువురు భూకబ్జాదారులు, గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి అమ్మకాలు చేపట్టారు. చెరువు శిఖంలో పలువురు యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. సోమన్నకుంట సమీపంలో శ్మశాన వాటికకు కేటాయించిన మూడెకరాల స్థలంలో రెండున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి పలువురు ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. శ్మశాన వాటికకు కేవలం 20గుంటల స్థలం మాత్రమే మిగిలి ఉంది. జంగేడు శివారులోని తిప్పిరెడ్డికుంటలో ఆరు ఎకరాల శిఖం భూమిని ఓ రైతు కబ్జా చేసి పంట సాగు చేస్తున్నారు.