
ఆస్పత్రిలో డయాలసిస్ బెడ్ వద్ద మొగిలయ్య
వరంగల్ డెస్క్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడిగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బలగం సినిమాలో నటించి.. పాడిన పాటతో అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు వారు కన్నీళ్లతో కాలం గడుపుతున్నారు. మొగిలయ్యను బతికించుకోవడానికి కొమురమ్మ సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తోంది. బుడిగ జంగాలకు ఆస్తిపాస్తులు ఉండవు.. పొట్ట గడిస్తే చాలు. జీవనోపాధికి కళారూపాలే పెట్టుబడి. మొగిలయ్యకు తాత రామచంద్రు, తండ్రి పెంటయ్య, అన్న చనిపోయిన అనంతరం వారసత్వ ఆస్తిగా తంబూర, దిమ్మస వచ్చాయి. భార్య కొమురమ్మతో కలిసి బుర్రకథలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆయన కరోనా బారిన పడ్డాడు. కోలుకుని బాగానే ఉన్నాడు. ఏడాది క్రితం ఒకరోజు ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. చెయ్యి విరిగింది. ఆస్పత్రికి తీసుకెళ్లి చెక్ చేయిస్తే.. కిడ్నీ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. పరీక్షలు చేయిస్తే.. రెండు కిడ్నీలు ఫెయిలైనట్టు వచ్చింది. ఇంతకుముందు కరోనా సోకడం వల్లే మొగిలయ్య కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. అప్పటినుంచి వారానికి మూడు రోజులు దుగ్గొండి నుంచి వరంగల్ నగరానికి వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇదిలా ఉండగానే ఇటీవల కొత్త ఆరోగ్య సమస్య వచ్చిపడింది. బీపీ, షుగర్ పెరగడంతో ఆయన రెండు కళ్లపై ప్రభావం పడింది. ఇప్పుడు ఆయనకు కంటిచూపు కూడా పోయింది.
ఇప్పటివరకు రూ.14లక్షలు ఖర్చు
మొగిలయ్య వైద్యం కోసం ఇప్పటివరకు రూ.14లక్షల వరకు ఖర్చయ్యాయి. తాము సంపాదించకున్న డబ్బుకు తోడు మరో రూ.10లక్షల వరకు అప్పు చేసినట్లు భార్య కొమురమ్మ తెలిపింది. ఇక కళ్లు మళ్లీ కనిపించాలంటే రెండుసార్లు సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇందుకు దాదాపు రూ.3లక్షల దాకా అవసరమవుతాయని, కానీ అంత డబ్బు మొగిలయ్య దగ్గర లేదు. బలగం డైరెక్టర్ వేణు కొంత సాయం చేసినా.. సరిపోని పరిస్థితి.
మనసున్న మారాజులు ఆదుకోండి
ఇప్పటివరకు సంపాదించిన డబ్బులకు తోడు అప్పులు చేసి నా భర్తకు వైద్యం చేయించాను. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదు. వారానికి మూడు రోజులు వరంగల్ సంరక్ష ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీకింద డయాలసిస్ చేయిస్తున్నాం. నెలకు మందులకే రూ8వేల దాకా ఖర్చు వస్తుంది. రెండు కళ్లు పూర్తిగా పోయాయి. మళ్లీ కనిపించాలంటే ఒక్కో కంటికి రెండు సార్లు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. మనసున్న మారాజులు ఆదుకోవాలని రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా.
– మొగిలయ్య భార్య, కొమురమ్మ
గూగుల్‌పే నంబర్ : 90590 98236
ఫోన్‌పే నంబర్ : 91772 54408
కష్టాల్లో ‘బలగం’మొగిలయ్య
రెండు కిడ్నీలు ఫెయిల్..
వారానికి మూడు సార్లు డయాలసిస్
కనిపించని రెండు కళ్లు..
ఆపరేషన్ చేయాలంటున్న వైద్యులు
ఆర్థికసాయానికి
అర్థిస్తున్న భార్య కొమురమ్మ
ఆర్థికసాయం చేయదల్చిన వారు
పస్తం కొమురమ్మ బ్యాంక్ అకౌంట్ నంబర్:
62306309034
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా,దుగ్గొండి,
వరంగల్ జిల్లా.
ఐఎఫ్‌ఎస్సీ కోడ్ : SBIN0020655
