
భూపాలపల్లి అర్బన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి దేవరాజం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 1,686మందికి 1,622మంది హాజరుకాగా.. 64మంది గైర్హాజరైనట్లు తెలిపారు. 12రోజుల పాటు ఎటువంటి సంఘటనలూ చోటుచేసుకోకుండా పకడ్బందీగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల 31, ఏప్రిల్ 1న ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఉంటాయని తెలిపారు.
జర్నలిస్టులకు
శిక్షణ తరగతులు
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఒకటినుంచి జిల్లాలోని జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్‌హౌస్‌లో నిర్వహించనున్న ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సభాధ్యక్షత వహించనుండగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మున్సిపల్ చైర్‌పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్ధు హాజరుకానున్నారు.
‘ఎమ్మెల్యేపై
ఆరోపణలు అవాస్తవం’
పలిమెల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని భీం సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మీద కుట్ర పూరితంగానే అరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఆరోపణలు చేస్తున్న వారిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆరోపణలు మానుకోవాలని, ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉచితంగా విద్య, వైద్యం
టేకుమట్ల(రేగొండ): నిరుపేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందించాలని ఉచిత విద్య, వైద్యం సాధన సమితి జాతీయ అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ అన్నారు. సాధన సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లాలో చేపట్టిన పాదయాత్ర బుధవారం రేగొండ మండలం రాయపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా విద్య, వైద్యం అందించకపోవడంతో నిరుపేదలు వీటికోసం అధికంగా ఖర్చుచేస్తున్నారన్నారు. దీంతో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఏడునూతల నిశీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆయన వెంట ఉత్తర తెలంగాణ ఇన్‌చార్జ్ నమిండ్ల కరుణాకర్, గ్రామస్తులు ఉన్నారు.
మృతురాలి కుటుంబానికి పరామర్శ
కాటారం: మండలకేంద్రంలోని గారెపల్లిలో ఇటీవల మృతిచెందిన తోట మల్లక్క కుటుంబాన్ని బుధవారం బీఆర్‌ఎస్ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, బీఆర్‌ఎస్ యూత్ జిల్లా నాయకుడు జక్కు రాకేశ్ పరామర్శించారు. వీరి వెంట పార్టీ మండల అధ్యక్షుడు తోట జనార్దన్, యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ దబ్బెట స్వామి, జోడు శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు ఎలుబాక సుజాత, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ వంగళ రాజేంద్రాచారి, కొండగొర్ల వెంకటస్వామి, ముక్తి తిరుపతి ఉన్నారు.
