
పొగాకుకు నిప్పంటించి నిరసన
స్టేషన్‌ఘన్‌పూర్: పొగాకు పంటను కంపెనీ వారు కొనుగోలు చేయడం లేదని శనివారం ఛాగల్లు గ్రామంలో జాతీయ రహదారిపై పొగాకుకు నిప్పంటించి రైతులు నిరసన, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతులు ఆకుల నర్సింగం, వడ్లకొండ యాదగిరి, పొన్నబోయిన రాజు, కె.యాకయ్య తదితరులు మాట్లాడారు. ఛాగల్లుకు చెందిన పొగాకు రైతులకు వీఎస్‌టీ, డెక్కన్ కంపెనీలకు చెందిన ఉద్యోగి మాయమాటలు చెప్పి పొగాకు పంట సాగు చేశాక క్వింటాకు రూ.18వేలకు తీసుకుంటామని నమ్మబలికారని చెప్పారు. దీంతో ఛాగల్లు క్లస్టర్ పరిధిలో దాదాపు 300 ఎకరాల్లో పొగాకు సాగుచేశామన్నారు. తీరా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశాక ప్రస్తుతం ఆయా కంపెనీల వారు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వృథాగా పోతుందని, ఈ విషయమై సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కుల యాదగిరి, ఐలయ్య, శేషు తదితరులు పాల్గొన్నారు.