
అప్పుడే ఎరువుల కొరత..!
● జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దొరకని యూరియా ● మరికొన్ని ప్రాంతాల్లో లభించని డీఏపీ ● ఎరువుల కోసం ఎగబడుతున్న రైతులు
జగిత్యాలఅగ్రికల్చర్: పంటల సాగు పూర్తిస్థాయిలో ప్రారంభంకాకుండానే రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. పంటలకు వినియోగించే రసాయన ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఏర్పడితే.. మేడిపల్లి, సారంగాపూర్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో డీఏపీ కొరత రైతాంగాన్ని వేధిస్తోంది. మొక్కజొన్న, వరి సాగు చేస్తున్న రైతులు ఎరువుల కోసం సింగిల్ విండో కేంద్రాలు, ఆగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు. దీనిని అదునుగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక రేట్లకు విక్రయించే పనిలో పడ్డారు.
4.14 లక్షల ఎకరాల్లో పంటల సాగు
జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. వరి 3.10లక్షల ఎకరాలు, మొక్కజొన్న, పసుపు, కంది, పెసర వంటి ఆరుతడి పంటలను లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు మొదటి దశ కింద యూరియా వేయాల్సిన అవసరం ఉంది. యూరియా సింగిల్ విండో కేంద్రాల్లో అందుబాటులో లేదు. ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్నందున తొలిదశ డీఏపీ అవసరం. ఆ ఎరువు కూడా అందుబాటులో లేదు. ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నా.. రైతులు డీఏపీ వాడేందుకే మొగ్గుచూపుతారు.
కొరత అంటూ వదంతులు
వానాకాలం సీజన్‌లో జిల్లాకు 40,351 టన్నుల యూరియా, 7,768 టన్నుల డీఏపీ అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే యూరియా 7వేల టన్నులు, డీఏపీ వెయ్యి టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. దీంతో రానున్న రోజుల్లో ఎరువులు దొరుకుతాయో.. లేదో.. అన్న సంశయంతో రైతులు ఒక్కసారిగా ఎగబడుతున్నారు. గతేడాది జూన్ వరకు 4138.669 టన్నుల యూరియా అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూన్ వరకే 7,641.460 టన్నులు అమ్ముడు పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కొంతమంది రైతులు ప్రస్తుతం అవసరం లేకున్నా.. నిల్వ చేసుకుంటున్నారని, ఫలితంగా అక్కడక్కడ కృత్రిమ కొరత ఏర్పడుతోందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతేడాది గొల్లపల్లి మండలంలో 27.315 టన్నులు అమ్మగా.. ఈ ఏడాది ఇప్పటివరకే 284.050 టన్నులు అమ్ముడుపోయింది. మల్లాపూర్, మెట్‌పల్లి, మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, బీర్పూర్, బుగ్గారం, మల్యాల, పెగడపల్లి మండలాల్లో అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నట్లు తేలింది.
కోత పెడుతున్న ప్రభుత్వం
రైతులు పంటలకు అవసరం లేకున్నా.. రసాయన ఎరువులు వాడుతున్నారని గుర్తించిన కేంద్రం ఆ మేరకు కోత పెడుతోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో కొరత ఏర్పడుతోంది. మరోవైపు ఎరువుల భారం రైతులపై పడకుండా సబ్సిడీ ఇస్తోంది. 50 కిలోల డీఏపీ బస్తాకు రూ.1350, యూరియా రూ.300 చొప్పున అందిస్తోంది. డీఏపీకి ఉపయోగించే ముడి పదార్థాలను సౌదీఅరేబియా, చైనా, మొరాకో, రష్యా, జోర్డాన్ నుండి దిగుమతి అవుతోంది.
మార్క్‌ఫెడ్ ద్వారా సొసైటీలకు..
మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా జిల్లాలోని 51 సొసైటీలకు రసాయన ఎరువులు అందుతాయి. ఎరువుల కంపెనీలు 50శాతం మార్క్‌ఫెడ్‌కు.. మరో 50 శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తోంది. అయితే ప్రైవేట్ డీలర్లకు వెళ్లే యూరియా, డీఏపీ ఎక్కడికి పోతుందో అనే దానిపై స్పష్టత లేదు. ప్రైవేట్ వ్యాపారులు రవాణా..హమాలీ ఖర్చులు చూసుకుని ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు అధిక రేటుకు విక్రయిస్తున్నారు. సొసైటీల ద్వారా ప్రభుత్వ ధరకే రసాయన ఎరువులు విక్రయిస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఎగబడుతున్నారు.
వచ్చింది 450 బస్తాలు.. ఇచ్చింది 150 మందికి.
ఇబ్రహీంపట్నం: మొక్కజొన్న పంటకు మొదటి దశ యూరియా వేయాల్సిన సమయం రావడం.. ఎరువు కొరతగా ఉండడంతో ఇబ్రహీంపట్నంలో రైతులు అయోమయానికి గురవుతున్నారు. గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 450 బస్తాలతో లారీ లోడ్ వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ఉదయమే వచ్చి యూరియా కోసం వచ్చి ఎగబడ్డారు. ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున 150 మంది రైతులకు పంపిణీ చేశారు. సుమారు 70 మంది రైతులు యూరియా దొరక్కపోవడతంఓ వెనుదిరిగి వెళ్లారు. ఈ ఏడాది 50 శాతం యూరియానే కేంద్రం సరఫరా చేస్తుందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రెండు రోజుల్లో మరో 40 టన్నుల యూరియా సొసైటీకి వస్తుందని ఏవో రాజ్‌కుమార్ తెలిపారు.
ఎరువులు సరఫరా చేయాలి
నాట్లు వేస్తున్నాం. డీఏపీ దొరకడం లేదు. ప్రైవేట్ వ్యాపారులు అధిక రేటుకు విక్రయిస్తున్నారు. డీఏపీ వేయకుంటే వరి సరిగా కుదురుకోదు. మొక్కజొన్నకు మొదటి దశ కింద యూరియా వేయాల్సి ఉంది. అది కూడా సరిగ్గా దొరకడం లేదు.
– చీటేటి జీవన్ రెడ్డి, తొంబర్రావుపేట
ఎరువుల కొరత లేదు
జిల్లాలో ఎరువుల కొరత లేదు. తప్పుడు సమాచారంతో.. అవసరం లేకున్నా రైతులు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. సీజన్‌ను బట్టి.. నెలవారీగా జిల్లాకు రసాయన ఎరువులు వస్తాయి. మిర్చి, వరి, మొక్కజొన్నకు యూరియాను మోతాదు మించి వాడుతున్నారు.
– భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి

అప్పుడే ఎరువుల కొరత..!

అప్పుడే ఎరువుల కొరత..!

అప్పుడే ఎరువుల కొరత..!