Afghanistan Crisis: తాలిబ‌న్ల‌కు బైడెన్‌ సర్కార్ భారీ షాక్‌!

US freezes usd 9.5bn of Afghan reserves to blockTaliban access to funds - Sakshi

అఫ్గాన్‌ నిధులపై ఆంక్షలు విధించిన అమెరికా

తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయంటున్న అమెరికా

వాషింగ్టన్‌: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు తాజాగా అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. ఎవ్వరి మీదా ప్రతీకార చర్యలు లేవు. తమ నాయకుడి ఆదేశాల మేరకు అందర్న క్షమించేశాం..అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామంటూ ప్రకటించిన తాలిబన్ల దూకుడుకు అమెరికా జో బైడెన్‌ సర్కార్‌ బ్రేకులు వేసింది. తాలిబన్లకు దక్కకుండా నిధులను స్తంభింప చేసింది.  అమెరికా బ్యాంకుల్లోని అఫ్గన్‌కు సంబంధించిన నిధులను  ఫ్రీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. 

కాబూల్ తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత వారికి నిధులు అందుబాటులో లేకుండా అమెరికా చర్యలు తీసుకుంటోంది. యుఎస్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్, ఇతర అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘాన్‌ నిధులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 9.5 బిలియన్‌ డాలర్ల మేర నిధులను నిలిపివేసింది. తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. తమ బ్యాంకుల్లోని అఫ్గన్‌ ప్రభుత్వానికి చెందిన ఆస్తులు తాలిబాన్లకు అందుబాటులో ఉండవని  పరిపాలనా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తాలిబాన్‌లపై ఒత్తిడి తెచ్చేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇతర చర్యలను కూడా ఆలోచిస్తోందని చెప్పారు. ఇప్పటికే జర్మనీ డెవలప్‌మెంట్‌ నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. (Afghanistan: తాలిబన్లకు మరో షాక్‌! సాయం నిలిపివేత)

అఫ్గన్‌ కరెన్సీ పతనం
తాలిబన్ల ఆక్రమణ తరువాత అఫ్గన్‌ కరెన్సీ అఫ్గని రికార్డు నష్టాలను చవిచూస్తోంది.. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, మంగళవారం 4.6 శాతం పడిపోయి డాలర్‌కు 86.0625 స్థాయికి చేరింది. (Afghanistan: పాపం పసివాడు, గుండెలు పగిలే దృశ్యం)

నిరసన సెగలు, కాల్పులు కలకలం
మ‌రోవైపు అఫ‍్గన్‌లో తాలిబన్లను వ్యతిరేకంగా నిరసన సెగలు మరింత చెలరేగాయి. దీంతో ఆందోళన చేస్తున్న ప్రజలపై  తాలిబన్ల కాల్పులకు దిగారు. జలాలాబాద్‌లో అఫ్గన్‌ జెండా ఎగరేసిన వారిపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. 10 మందికి పైగా గాయబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తమ పౌరులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ఆయా దేశాలు  ప్రయత్నిస్తున్నాయి. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top