
స్వీడన్‌లో పురాతన చర్చి మరో చోట ఏర్పాటు
కిరునా: అందమైన ఓ పురాతన చర్చి అలా రోడ్డుపై మెల్లగా ముందుకు వెళ్తుందంటే చూసే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. స్వీడన్ ప్రభుత్వం అటువంటి బృహత్ కార్యక్రమానికి నడుం బిగించింది. కిరునా నగరంలో 113 ఏళ్ల క్రితం కలపతో నిర్మించిన ‘కిరునా కిర్కా’ను ఐదు కిలోమీటర్ల దూరంలో మరో చోట ఏర్పాటు చేయనుంది. నగరంలోని కొన్ని భవనాలతోపాటు ప్రజలకు సైతం పునరావాసం కల్పిస్తోంది. ఇదంతా ఆ నగరం చుట్టుపక్కలున్న ఇనుప ఖనిజం కోసం కావడం గమనార్హం.
ఎంతో ఇష్టమైన నిర్మాణం
స్వీడన్ ప్రభుత్వ ఎల్‌కేఏబీ కంపెనీ కిరునా చుట్టుపక్కల ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇనుప ఖనిజం గనిని నిర్వహిస్తోంది. కిరునాలో గని తవ్వకాలు 1910లో మొదలు పెట్టిన ఎల్‌కేఏబీ కంపెనీయే అక్కడి గుట్టపై 1912లో ఈ లూథరన్ చర్చిని పూర్తిగా కలపతో నిర్మించింది. స్వీడన్ వాసులకు ఇది ఎంతో ఇష్టమైంది కిరునా చర్చి. 2001లో ప్రభుత్వం చేపట్టిన ఓ సర్వేలో 1950కి ముందున్న వాటిలో అత్యుత్తమ కలప నిర్మాణంగా స్వీడన్ ప్రజలు కిరునా చర్చికి ఓటేశారు.
నగరానికి పునరావాసం
లోతులో చేపడుతున్న గని తవ్వకాలతో ఇప్పటికే నగరంలోని కొన్ని ఇళ్లు, నిర్మాణాలు పగుళ్లు వచ్చాయి. ఖనిజం కోసం 1,365 మీటర్ల లోతులో తవ్వకాలు చేపట్టాల్సి ఉన్నందున నివాసాలు, నిర్మాణాలకు ప్రమాదం ఉందని కంపెనీ అంచనా వేసింది. దీంతో, నగరాన్ని తరలించేందుకు 2004 నుంచే 30 ఏళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలోని 3వేల ఇళ్లతోపాటు 6 వేల మందికి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతంలో పునరావాసం కల్పించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ, వాణిజ్య నిర్మాణాలను కూల్చి వేశారు. సుమారు 25 భవనాలను పునాదుల నుంచి పైకి లేపి, ప్రత్యేక వాహనాల్లో కొత్త నగరంలోకి తరలించారు. అందమైన పురాతన కిరునా చర్చి సహా మరో 16 భవనాలను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారీ ట్రాలర్‌పైన ఎర్రని చర్చి
సుమారు 40 మీటర్ల వెడల్పు, 672 మెట్రిక్ టన్నుల బరువైన కిరునా చర్చిని తరలించేందుకు ప్రత్యేకంగా ట్రయిలర్‌ను నిర్మించారు. దీనిపైకి ఎరుపు రంగులో ఉన్న చర్చి నిర్మాణాన్ని తరలించారు. ట్రాలీ ప్రయాణించే మార్గంలోని రోడ్డు వెడల్పును 9 మీటర్ల నుంచి ఏకంగా 24 మీటర్లకు పెంచారు. ఒక వంతెనను సైతం నేలమట్టం చేశారు. 12 గంటలు పట్టే చర్చి ప్రయాణం మంగళవారం మొదలై బుధవారంతో ముగియనుంది. మధ్యలో రెండుసార్లు మాత్రం టీ విరామం కోసం ఆపుతారు. గంటకు అర కిలోమీటర్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల వేగం వరకు ట్రాలీ ప్రయాణించనుంది. చర్చి తరలింపు సందర్భంగా కిరునాలో భారీ సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్వీడన్ రాజు కార్ల్ గుస్తావ్ సైతం హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కొత్త నగరంలో 2026 చివరి కల్లా ఈ చర్చిని తిరిగి తెరవనున్నారు. చర్చి తరలింపునకు అయ్యే ఖర్చు వివరాలను మాత్రం మైనింగ్ కంపెనీ వెల్లడించలేదు. యూరప్‌లో ఉత్పత్తయ్యే ఇనుప ఖనిజంలో 80 శాతం వరకు కిరునాలోనే ఎల్‌కేఏబీ తవ్వి తీస్తోంది. భవిష్యత్తులో దీనిని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది.